Chandrababu Comments against AP CM YS Jagan: చింతలపూడి: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల చేసిన అర్జునుడు కామెంట్లపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. జగన్ తాను అర్జునుడితో పోల్చుకుంటున్నారు.. ముమ్మాటికీ ఏపీ సీఎం అక్రమార్జనుడేనని చంద్రబాబు ఎద్దేవా చేశారు. పులివెందుల కుటుంబ పంచాయతీని రాష్ట్ర సమస్యగా చేయాలని చూస్తున్నారని.. కేసుల నుంచి బయటపడేందుకు తండ్రి YSR పేరును ఎఫ్ఐఆర్ లో పెట్టించిన ఘనుడు జగన్ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన రా... కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ‘చింతలపూడి సభ చూస్తుంటే... గెలిచేది మనమేనని, ఇందులో అనుమానం లేదనిపిస్తుంది. మరో రెండు నెలల్లో సైకో జగన్‌ను ఇంటికి పంపాల్సిందే. యువత మొత్తం తెలుగుదేశం, జనసేనలోనే ఉన్నారు. మీరు తలుచుకుంటే మన విజయాన్ని ఆపే దమ్ము ఎవరికీ లేదు. ఈ గెలుపు మనకోసం కాదు. ఒక కుటుంబ పెద్ద తాగుబోతు అయితే ఆ కుటుంబం చితికిపోతుంది. రాష్ట్ర పెద్ద సైకో అయితే అంతా సర్వనాశనం అవుతుంది. జగన్ రెడ్డి దిగిపోవడం కాదు.. ప్రజలే జగన్ ని బరించే స్థితిలో లేరు. రాష్ట్ర ప్రజలను రూ.12 లక్షల కోట్లు అప్పుల్లో ముంచాడు. జగన్ నాశనం చేసిన రాష్ట్రాన్ని పున:నిర్మించుకోవడంలో మీ అందరి సహకారం కావాలి’ అన్నారు చంద్రబాబు.
జలగలా ప్రజల రక్తాన్ని తాగుతున్నాడంటూ ఫైర్
జగన్ ఇచ్చేది పదయితే దోచుకునేది తొంభై అని, తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచడంతో విద్యుత్ వినియోగదారులపై రూ.64 వేల కోట్ల భారం పడిందన్నారు చంద్రబాబు. మద్యంపై జగన్ దోచుకుంటున్నారని... ఒక క్వార్టర్ మందులో రూ.150 లు జగన్ రెడ్డి కమీషన్ కొట్టేస్తున్నారంటూ మండిపడ్డారు. జగన్ అనే జలగ ఏడాదికి రూ.54 వేల రూపాయలు మద్యం తాగేవారి నుంచి దోచేస్తున్నారని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో జే బ్రాండ్ల మందు తాగిన 30 లక్షల మంది అనారోగ్యం పాలు కాగా, 30 వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆరోపించారు. ఇంటిపై పన్ను, చెత్త పన్ను, ఆర్టీసీ ఛార్జీలను పెంచడంతో పాటు పంచభూతాలను మింగేసే అక్రమార్జునుడు జగన్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నిత్యవసర సరుకుల ధరలన్నీపెరిగాయి
నాడు పెట్రోల్ రూ.76 ఉంటే నేడు రూ.111, నాడు డీజీల్ రూ.70 ఉంటే రూ.99కి చేరిందన్నారు. నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నది జగన్ సర్కార్ అని విమర్శించారు. నాడు గ్యాస్ సిలెండర్ రూ.726 నేడు ఇప్పుడు రూ.1175.. రూ.200 వచ్చే కరెంట్ బిల్లు నేడు రూ.1000కి చేరిందన్నారు. మద్యం, కేబుల్ బిల్లు రెట్టింపు అయ్యాయి. ఐదేళ్లలో రూ.12 లక్షల కోట్లు అప్పు చేసిన జగన్ రెడ్డి త్వరలోనే జైలుకెళతాడని చంద్రబాబు జోస్యం చెప్పారు. నేడు ఇసుక బంగారమైపోయిందని, కేజీల లెక్కన అమ్ముతున్నారని పేర్కొన్నారు. సామాన్యుడు ఇళ్లు కట్టుకేనే పరిస్థితి లేదని, మరోవైపు రాష్ట్రంలోని రోడ్లన్నీ గుంతలమయమేనని చెప్పారు. రాష్ట్రానికి ఆదాయం పెంచాలంటే అమరావతి లాంటి రాజధానిని కట్టాలని, రైతులు 33 వేల ఎకరాలు ఇస్తే దాన్ని జగన్ నాశనం చేశారని చంద్రబాబు ఆరోపించారు.
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.. పేదలకు ఇళ్లు
యువతకు ఏడాదికి 4 లక్షల చొప్పున 5 ఏళ్లలో 20 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. జగన్ రెడ్డి యువతను హోటల్లో సర్వర్లుగా చేయాలనుకుంటే తాను యువతను ఐటీ ఇంజనీర్లుగా, పారిశ్రామికవేత్తలుగా చూడాలన్నది తన ఆకాంక్ష అన్నారు. ఉద్యోగం వచ్చే వరకు తల్లిదండ్రులపై ఆధారపడకుండా యువతకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. తెలుగు మహిళలు పేదరికం నుంచి బయటపడేలా నెలకు రూ.1500 లు వారి అకౌంట్లలో వేస్తాం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తామన్నారు. దీన్ని ఏడాదికి లక్షా 50 వేలు చేసేలా మార్గం చూపిస్తాం. తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. టిడ్కో ఇళ్లు పూర్తిచేసి ప్రతీ ఒక్క లబ్దిదారుడికి ఇచ్చే బాధ్యత తమదేనన్నారు. 200 ఫించన్ ను 2000 చేసిన ఘనత టీడీపీదేనని గుర్తుచేశారు.