Chandrababu Comments on AP Capital And Warning: రాష్ట్రంలో ఐదేళ్లు విధ్వంసం పాలన సాగిందని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పునరుద్ఘాటించారు. ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వార్నింగ్ ఇచ్చారు. పదవి వచ్చిందని విర్రవీగుతూ.. అహంకారంతో పాలన సాగిస్తే ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని అన్నారు. 'ఓటర్లు ప్రవర్తించిన తీరు రాష్ట్ర చరిత్రలో నిలుస్తుంది. తప్పు చేసిన వారిని క్షమిస్తే ఆ తప్పు అలవాటుగా మారుతుంది. అలాంటి వారికి చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఉంది. విధ్వంస, కక్షా రాజకీయాలకు దూరంగా ఉండాలి. పదవి వచ్చిందని విర్రవీగకుండా వినయంతో పనిచేయాలి. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతతో నిర్వర్తించాలి. పదవి పెత్తనం కోసం కాదు. ప్రజలకు సేవ చేసేందుకు ఉపయోగించాలి. నా కుటుంబానికి అవమానం జరిగింది. కౌరవ సభ అని చెప్పి బయటకు వచ్చాను. ప్రజాక్షేత్రంలో అసెంబ్లీని గౌరవ సభగా మార్చి తిరిగి అడుగు పెడతానని శపథం చేశాను. ప్రజలు నా శపథాన్ని గౌరవించారు. గౌరవించిన ప్రజలను నిలబెట్టాలి.' అని చంద్రబాబు స్పష్టం చేశారు.



'అమరావతే రాజధాని'



ఏపీకి రాజధాని అమరావతే అని చంద్రబాబు తేల్చిచెప్పారు. మూడు రాజధానులంటూ ఆటలాడే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. 'అమరావతి రాజధానిగా ఉంటుంది. విశాఖను ఆర్థిక, ఆధునిక రాజధానిగా చేసుకుందాం.' అని పేర్కొన్నారు. '14 ఏళ్లు సీఎంగా,15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నాను. ఎన్నో సవాళ్లు, ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని ముందుకెళ్లాం. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. గత ఐదేళ్లలో రాష్ట్రంలో విధ్వంస పాలన సాగింది. విధ్వంసంతోనే పాలన మొదలైంది కూడా. అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. అన్ని వర్గాలు ఇబ్బందులు పడ్డాయి. పదేళ్ల తర్వాత కూడా రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది. రైతులు అప్పులపాలయ్యారు. పెట్టుబడులు రాలేదు. పరిశ్రమలు రాక నిరుద్యోగులు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉన్నాయో తెలీదు. కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మకంగా ముందుకెళ్లాలి.' అని చంద్రబాబు పిలుపునిచ్చారు.


'స్టేట్ ఫస్ట్ అనేదే నినాదం'


స్టేట్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. 'సీఎంగా ఓ సాధారణ మనిషిగానే జనంలోకి వెళ్తాను. మిత్రుడు పవన్ తో పాటు మేమంతా సామాన్య వ్యక్తులుగానే మీ వద్దకు వస్తాం. హోదా సేవ కోసమే తప్ప.. పెత్తనం కోసం కాదు. నా కాన్వాయ్ కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని అధికారులకు చెప్పాను. ఒక సిగ్నల్‌కు మరో సిగ్నల్‌కు గ్యాప్ పెట్టుకోండి. 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు. ప్రజలకు అసౌకర్యం కలగకూడదనే స్పష్టమైన ఆదేశాలిచ్చాం. దాడుల చేసి బాధితులపైనే కేసులు పెట్టే పరిస్థితి ఉండదు. ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి భంగం కలగదు. ప్రజాహితం కోసమే పని చేస్తాం. ప్రతి నిర్ణయం ప్రతి అడుగు ప్రజల కోసమే ఉంటుంది. టీడీపీ హయాంలో పోలవరం పనులు 72 శాతం పూర్తి చేస్తాం. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. కేంద్ర సహకారంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. నధులు అనుసంధానించి ప్రతి ఎకరానికి నీళ్లందిస్తాం.' అని చంద్రబాబు స్పష్టం చేశారు.


Also Read: Chandrababu: 'ట్రాఫిక్ ఆపడం, రోడ్లు మూసేయడం, చెట్లు కొట్టడం ఉండదు' - సామాన్యులుగా, మామూలు మనిషిగానే ప్రజల్లోకి వస్తానన్న చంద్రబాబు