Chandrababu Tirumala Tour : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్లేందుకు విమానంలో తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘనస్వాగతం లభిచింది. దేవదేవుళ్ల ఆశీస్సులు తీసుకుని ఇక రాజకీయ కార్యక్రమాల్లో దూకుడు పెంచాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకోనున్నారు. అనంతరం ప్రముఖ దేవాలయాలను చంద్రబాబు నాయుడు దర్శించుకోనున్నారు.
దేవాలయాల సందర్శనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతికి చేరుకున్నారు. నేరుగా తిరుమలకు చేరుకుని అక్కడే బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నాం చంద్రబాబు నాయుడు అమరావతి చేరుకుంటారు. మరుసటి రోజు డిసెంబర్ 2న విజయవాడ కనకదుర్గమ్మను చంద్రబాబు కుటుంబ సమేతంగా దర్శించుకుని మెుక్కులు చెల్లించుకుంటారు. డిసెంబర్ 3న విశాఖ వెళ్లనున్నారు. అదేరోజు సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 5న శ్రీశైలం మల్లన్నను చంద్రబాబు కుటుంబం దర్శించుకోనుంది. ఈ మేరకు టీడీపీ కార్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది.
స్కిల్ స్కాం కేసులో ఏకంగా 52 రోజులుగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే కేసులో రెగ్యులర్ బెయిల్ మంజూరు అయ్యింది. ఈ బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై తీర్పు ప్రాసెస్ లో ఉందని ఆ తీర్పు తర్వాత విచారణ చేస్తామని తెలిపింది. చంద్రబాబుపై ప్రభుత్వం పెట్టిన ఇబ్బడిమబ్బడి కేసుల గురించి అటు ఏసీబీ కోర్టులో.. ఇటు హైకోర్టులో.. సుప్రీంకోర్టులో అదే పనిగా విచారణకు వస్తున్నాయి. కానీ క్వాష్ పిటిషన్ పై తీర్పు రాని కారణంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. చివరికి చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ కూడా ఈ కారణంగానే వాయిదా పడింది. ఆ కేసు పదకొండో తేదీకి వాయిదా పడింది. హైకోర్టులో కూడా వివిధ కేసుల్లో ముందస్తు బెయిల్స్ పై విచారణ కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతుంది.
క్వాష్ పిటిషన్ తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా వస్తే.. ఆయన పై పెట్టి నకేసులన్నీ అక్రమం అని తేలుతాయి. కోర్టుల్లో ఉన్నవన్నీ తేలిపోతాయి. వాటికి విచారణ అర్హత కూడా ఉండదు. ఒక వేళ చంద్రబాబుకు 17ఏ వర్తించదని సుప్రీంకోర్టు చెబితే మాత్రం.. అన్ని కేసుల్లో విచారణలు దాదాపుగా పూర్తయినందున.. తీర్పులు వెల్లడించాల్సి ఉంటుంది. ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో చంద్రబాబును రాజకీయానికి దూరం చేయాలనుకుంటున్న జగన్ రెడ్డి పన్నాగాలు వర్కవుట్ అవుతాయా లేదా అన్న క్వాష్ పిటిషన్ పై తీర్పును బట్టి వెల్లడయ్యే అవకాశం ఉండటంతో.. అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది.