Chandrababu Interacts With Women Groups: వైసీపీ ఐదేళ్ల పాలనలో సీఎం జగన్ (Cm Jagan) అన్ని వర్గాలను మోసం చేశారని.. ఎక్కడ చూసినా కుంభకోణాలేనని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. గూడూరులో శనివారం ఆయన మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ప్రజల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. 'సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నాను. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నా. నేను ఎప్పుడూ బ్యాలెన్స్ తప్పలేదు. నిరంతరం పేద ప్రజల కోసమే ఆలోచన చేశాను. గూడూరులో సిలికా.. స్వర్ణముఖి నదిలో ఇసుక దోచుకున్నారు. సిలికా పరిశ్రమలు వచ్చి పిల్లలకు ఉద్యోగాలు రావాలని కోరుకున్నా. వైసీపీ హయాంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. సంపదను సృష్టించడం టీడీపీకే తెలుసు. రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలనేది నా లక్ష్యం. ఇదే నా జన్మదిన ఆశయం.  ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలకు మరింత గుర్తింపు రావాలి.' అని చంద్రబాబు పేర్కొన్నారు.






మహిళల్లో ఎంతో చైతన్యం వచ్చిందని.. మహిళల కోసం ప్రత్యేక వర్శిటీ, ఆస్తి హక్కును ఎన్టీఆర్ కల్పించారని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల నాటికి చట్టసభల్లో కూడా 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయని అన్నారు. 'స్థానిక సంస్థల్లో మహిళలకు ఎన్టీఆర్ రిజర్వేషన్ ఇచ్చారు. జనాభాలో 50 శాతం ఉన్న మహిళల కోసం డ్వాక్రా సంఘాలు పెట్టానని.. మహిళలను పొదుపు ద్వారా ఆర్థికంగా బలోపేతం చేశాం. టీడీపీ హయాంలో కుటుంబానికి ఆర్థిక మంత్రిగా మహిళలే ఉన్నారు. మహిళలకు ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాం. ఐటీ రంగంలోనూ మహిళలు రాణిస్తున్నారు.' అని చంద్రబాబు పేర్కొన్నారు.


ఘనంగా పుట్టినరోజు వేడుకలు



అటు, చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, అభిమానులు శనివారం ఘనంగా నిర్వహించారు. అనంతపురం జిల్లాలోని కణేకల్ లో విద్యార్థులు, టీడీపీ నాయకులతో కలిసి చంద్రబాబు కేక్ కట్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుప్పం పరిధిలోని సామగుట్టపల్లె వద్ద కదరిబండ నరసింహ స్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సామగుట్టపల్లెలోని కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కుప్పం టీడీపీ కార్యాలయంలోనూ ముస్లిం మైనారిటీలతో కలిసి కేక్ కట్ చేశారు. అటు, తిరుమలలోనూ టీడీపీ నేతలు చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాయలసీమ టీడీపీ నేత శ్రీధర్.. శ్రీవారి ఆలయం అఖిలాండం వద్ద 750 టెంకాయలు కొట్టి.. 7.50 కిలోల కర్పూరం వెలిగించారు. ఈ వేడుకల్లో టీడీపీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


జనసేనాని పవన్ విషెష్


జనసేనాని పవన్ కల్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు బర్త్ డే విషెష్ చెప్పారు. 'రాజకీయంగా, పరిపాలనా పరంగా చంద్రబాబు అనుభవజ్ఞులు. ఆయన నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచిస్తారు. వైసీపీ పెట్టిన కేసులతో జైల్లో ఉన్నా ఆయన మనో నిబ్బరం కోల్పోలేదు. రాష్ట్రాభివృద్ధి కోసం దూరదృష్టితో ఆలోచన చేసే నాయకుడు. చంద్రబాబుకు సంపూర్ణ ఆయురారోగ్యాలు అందించాలని భగవంతున్ని ప్రారిస్థున్నాను.' అని పవన్ తెలిపారు.


Also Read: Botsa Assets: భారీగా పెరిగిన మంత్రి బొత్స కుటుంబ ఆస్తులు, కేవలం ఐదేళ్లలోనే రెండు రెట్లు పెరిగిన విలువ