AP Bandh: చంద్రబాబు అరెస్టు, రిమాండుకు నిరసనగా ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. రాజకీయ కక్ష సాధింపుతో చేసిన అరెస్టును బంద్ ద్వారా ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరింది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమ అధినేత గొంతు నొక్కేందుకే ఇలా చేశారని టీడీపీ నేతలు మండిపడ్డారు. కాగా అత్యవసర సేవల్లోని వారు మినహా మిగతా వర్గాలన్నీ బంద్కు సహకరించాలని నేతల కోరారు. 


పలు చోట్ల రోడ్లపైకి టీడీపీ నేతలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల నిరసనలు చేపట్టారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మసీద్ సెంటర్లో సీఎం జగన్‌కు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. కందుకూరులోని పామూరురోడ్డు జంక్షన్‌లో టీడీపీ శ్రేణులు మానవహారంగా నిలబడి ఆందోళన చేపట్టాయి. సీఎం డౌన్ డౌన్, సైకో దిగిపోవాలి, చంద్రబాబు నాయుడుని వెంటనే విడుదల చేయాలి అంటూ నినాదాలు చేశారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో నేతలు ఆందోళనలు చేపట్టారు.


చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్
స్కిల్ డెవెలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సీఐడీ వాదనలతోనే కోర్టు ఏకీభవిస్తూ ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 2 వారాల రిమాండ్ విధించింది. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన జస్టిస్ హిమబిందు.. చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చారు. ఈ నెల 22 వరకు చంద్రబాబు రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించారు. 


జిల్లా ఎస్పీలకు కీలక ఆదేశాలు
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఏపీలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జిల్లాల ఎస్పీలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రతి మండలంలో 144 సెక్షన్ అమలు చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు గుంపుగా ఉండకుండా చూడాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 


మరికాసేపట్లో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలు కు తరలించనున్నారు. ఈ మేరకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. లేక రాత్రి సిట్ ఆఫీసుకు తరలించి, రేపు ఉదయం రాజమండ్రి జైలుకు తరలించే అవకాశం సైతం ఉంది. అయితే తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని భావించిన టీడీపీ శ్రేణులు నిరుత్సాహానికి లోనయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ప్రాథమిక ఆధారాలతోనే చంద్రబాబును అరెస్టు చేసినట్లు ఏపీ సిఐడి వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది. గవర్నర్ అనుమతితో అరెస్ట్ చేయాలన్న వాదనలను సైతం కోర్టు కొట్టిపారేసింది. 


అంతకుముందు స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో నేటి ఉదయం నుంచి దాదాపు ఏడున్నర గంటలకు పైగా ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. రాజకీయ ఉద్దేశంతోనే అరెస్ట్ జరిగిందని, ఈ కేసులో 409 సెక్షన్‌ పెట్టడం సరికాదన్నారు. ఒకవేళ ఆ సెక్షన్‌ పెట్టాలంటే సరైన సాక్ష్యం చూపాలని ఏసీబీ కోర్టులో సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు.