Yuvagalam :  తెలుగుదేశం పార్టీ, జనసేన ప౧త్తు ఖరారు కాలేదు కానీ ఆ పార్టీ కార్యకర్తలు మాత్రం కలిసి పని చేయడం ప్రారంభించారు. నారా లోకేష్ పాదయాత్ర ప్రస్తుతం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ పరిదిలో జరుగుతోంది. పొడపాడు గ్రామంలో లోకేష్, పవన్ కల్యాణ్ ఫోటోలతో ఫ్లెక్సీలను అభిమానులు ఏర్పాటు చేశారు.  ఇవి  ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. స్థానికులతో పాటు పాదయాత్రకు వచ్చిన వారు సైతం ఈ ఫ్లెక్సీలను ఆసక్తిగా చూస్తున్నారు. 


తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య అధికారికంగా ఖరారు కాలేదు కానీ ... జనసేనాని మాత్రం ఖచ్చితంగా ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామంటున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యమని.. ఓట్లు చీలకుండా చేస్తామని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. ఇప్పటికే రెండు, మూడు సార్లు చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యారు.  సరైన సమయం చూసుకుని పొత్తుల ప్రకటన చేస్తారని .. ఆ తర్వాత సీట్ల సర్దుబాటు చేసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో జనసైనికులు.. టీడీపీ నేతలతో కలిసి పని చేయడం ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో  టీడీపీ, జనసేన పార్టీలు కొన్ని చోట్ల కలిసి పని చేశాయి. మంచి ఫలితాలు సాధించాయి. ఈ క్రమంలో సాధారణ ఎన్నిక్లలోనూ కలిసి పని చేస్తే.. మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారు.              


ఇటీవలి కాలంలో వైఎస్ఆర్‌సీపీ నేతలు.. పవన్ కల్యాణ్ ను కూడా వ్యక్తిగతంగా టార్గెట్ గా చేసుకుంటున్నారు. చిరంజీవి  విషయంలోనూ వ్యక్తిగత విమర్శలు చేయడంతో..  జనసైనికులు ప్రభుత్వం, వైఎస్ఆర్‌సీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న వారని వచ్చే ఎన్నికల్లో గెలవనీయబోమని అంటున్నారు. ఈ క్రమంలో జనసైనికైలు.. కూడా.. తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేయడానికి మానసికంగా సిద్ధమవుతున్నారు. అందుకే.. లోకేష్ పాదయాత్రలో ఫ్లెక్సీలు పెడుతున్నారని అంటున్నారు.                                                        


నిజానికి టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనాలని జనసేన పార్టీ తమ పార్టీ శ్రేణులకు ఎలాంటి సంకేతాలు పంపలేదు. ఇటీవల పంచాయతీ నిధుల దారి మళ్లింపునకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా .. బీజేపీ ధర్నాలు చేసింది. ఆ ధర్నాల్లో.. జనసైనికులు కూడా పాల్గొన్నారు. ఇప్పటికీ బీజేపీ, జనసేన మధ్య పొత్తు అధికారికంగానే ఉంది. ఎన్నికలు ఎప్పుడు అనే దానిపై క్లారిటీ వస్తే.. పొత్తులపై క్లారిటీ వస్తుందని జనసేన , టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. భారతీయ జనతా పార్టీ వ్యూహం కూడా అర్థం కాకుండా ఉంది. ఆ పార్టీని కలుపుకోవాలని పవన్ అనుకుంటున్నారు. కానీ బీజేపీ మాత్రం..   వైసీపీతో సఖ్యతగానే ఉంటోంది. ఏదో ఓ పార్టీ వైపు ఉండటం కన్నా.. ప్రస్తుతం ఉన్నట్లుగా ఉంటేనే.. రెండు పార్టీల మద్దతు ఢిల్లీలో తమకు ఉంటుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.