Tata Group Chairman N Chandrasekaran met CM Chandrababu in Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టాల్సిన పెట్టుబడుల అంశాలపై మాట్లాడేందుకు టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్. చంద్రశేఖర్ ప్రతినిధి బృందంతో అమరావతి వచ్చారు. చంద్రబాబు, నారా లోకేష్‌తో పాటు ఇతర అధికారులతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో పెట్టుబడుల అంశాలపై చర్చలు జరిపారు.
కొద్ది రోజుల కిందట నారా లోకేష్ ముంబై వెళ్లి ఎన్. చంద్రశేఖరన్‌తో చర్చలు జరిపారు. ఆ తర్వాత విశాఖలో పది వేల మంది ఉద్యోగులతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ను ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించారు. ఆ విషయంతో పాటు తాజా హోటల్స్ గ్రూపులో ఏపీలో కనీసం ఇరవై హోటల్స్ పెట్టాలన్న ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం టాటా గ్రూప్ చైర్మన్ ముందు ఉంచిది. అలాగే టాటా పవర్ ఏపీలోని పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో రూ. 40వేల కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టే ఆలోచన చేస్తోంది. వీటన్నింటిపై చంద్రశేఖరన్.. చంద్రబాబుతో చర్చించారు.
Also Read: 'అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది' - మాజీ సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
టాటా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ తో సమావేశం గురించి చంద్రబాబు సోషల్ మీడియాలో వివరాలు తెలిపారు. టాటా గ్రూపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అత్యంత కీలకమైన భాగస్వామిగా పేర్కొన్నారు.
ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడుల కోసం పలు భారీ సంస్థలను సంప్రదిస్తున్నారు. ఈ క్రమంలో టాటా గ్రూపు ఆసక్తి చూపడంతో ప్రభుత్వం ఆయా సంస్థలకు కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమవుతోంది. విసాఖలో టీసీఎస్ క్యాంపస్ కోసం ఇప్పటికే ఆ కంపెనీ ప్రతినిధులు భవనాలను పరిశీలిస్తున్నారు. మిలీనయం టవర్స్ ఖాళీగానే ఉన్నందున ఆ టవర్స్ లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని చెబుతున్నారు. అయితే సొంత కార్యాలయాను టీసీఎస్ నిర్మించుకుంటుంది. ఆ సంస్థ ఆసక్తి చూపిస్తే భూములు కేటాయించే అవకాశం ఉంది. మరో ఆరు నెలల్లో టీసీఎస్ కేంద్రం విశాఖలో ప్రారంభమవుతుందని నారా లోకేష్ చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆ దిశగా మరో అడుగు ముందుకు పడినట్లుగా అయింది.