విజయవాడ రూట్ లో పలు రైళ్లు రద్దయ్యాయి. విజయవాడ-ఉప్పులూరు స్టేషన్ల మధ్య రైల్వే డబ్లింగ్‌ పనులు చివరిదశకు చేరుకున్నాయి. ఆ మార్గంలో పనులు జరుగుతున్న దృష్ట్యా ఇవాళ్టి నుంచి 14వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు చేస్తున్నట్లు విజయవాడ స్టేషన్‌ మేనేజర్‌ మోహన్‌గాంధీ తెలిపారు. ఈ నెల 13, 14 తేదీల్లో మచిలీపట్నం–బీదర్, బీదర్‌–మచిలీపట్నం, నర్సాపూర్‌–ధర్మవరం, ధర్మవరం–నర్సాపూర్, 12, 13 తేదీల్లో కాకినాడ–లింగంపల్లి, లింగంపల్లి–కాకినాడ రైళ్లను కూడా రద్దు చేసినట్లు తెలిపారు. 


ఈ తేదీల్లో సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ తెనాలి వరకు, నాగర్‌సోల్‌ ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి-నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లు విజయవాడ వరకు నడుపుతామని మోహన్ గాంధీ స్పష్టం చేశారు. తిరుపతి–పూరి ఎక్స్‌ప్రెస్‌ 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు, శేషాద్రి ఎక్స్‌ప్రెస్, ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లు 13, 14 తేదీల్లో ఏలూరు, నిడదవోలు మీదుగా దారి మళ్లింపు చేశామన్నారు. మచిలీపట్నం–విజయవాడ, నర్సాపూర్‌–గుంటూరు పాసింజర్‌ రైళ్లు పూర్తిగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. 


విజయవాడ డివిజన్‌ పరిధిలో  ఇవాళ్టి నుంచి 14వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు అయ్యాయి. విజయవాడ-ఉప్పులూరు స్టేషన్ల మధ్య డబ్లింగ్‌, ఎలక్ర్టిఫికేషన్‌ జరుగుతున్న బ్రాంచ్‌ లైన్‌లో నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనులు చేపడుతున్నారు. దీంతో మొత్తం 22 రైళ్లను రద్దు చేయగా, 9 రైళ్లను దారి మళ్లించారు. రెండు రైళ్ల సమయాలను మార్చామని అధికారులు తెలిపారు. 7 రైళ్లను మధ్యమార్గంలోనే నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ-నిడదవోలు మార్గంలో తిరిగే రైళ్లంటినీ రద్దు చేశారు. వారంలో పనులు పూర్తి చేసేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. విజయవాడ-గుడివాడ సెక్షన్‌లో డబ్లింగ్‌, ఎలక్ర్టిఫికేషన్‌ పనులు పూర్తయ్యాయని తెలిపారు. భీమవరం-నర్సాపూర్‌ మధ్య డబ్లింగ్‌, ఎలక్ర్టిఫికేషన్‌ పనులు జరుగుతున్నట్లు స్పష్టం చేశారు. 


రద్దైన రైళ్లు 
బీదర్‌-మచిలీపట్నం, మచిలీపట్నం-బీదర్‌, ధర్మవరం-నర్సాపూర్‌, నర్సాపూర్‌-ధర్మవరం, లింగంపల్లి-కాకినాడ టౌన్‌, కాకినాడ టౌన్‌-లింగంపల్లి, లింగంపల్లి-కాకినాడ పోర్టు, కాకినాడ పోర్టు-లింగంపల్లి, కాచిగూడ-విశాఖపట్నం, విశాఖపట్నం-కాచిగూడ, తిరుపతి-కాకినాడ టౌన్‌, కాకినాడ టౌన్‌-తిరుపతి, విశాఖపట్నం-విజయవాడ, విజయవాడ-విశాఖపట్నం రైళ్లు రద్దయ్యాయి. వీటితో పాటు విశాఖపట్నం-గుంటూరు, గుంటూరు-విశాఖపట్నం, విశాఖపట్నం-లింగంపల్లి, లింగంపల్లి-విశాఖపట్నం, విజయవాడ-మచిలీపట్నం, మచిలీపట్నం-విజయవాడ, నర్సాపూర్‌-గుంటూరు, గుంటూరు- నర్సాపూర్‌ రైళ్లను కూడా రద్దు చేశారు. 


మధ్యలో నిలిచిపోయే రైళ్లు ఇవే...  
కొన్ని రైళ్లను మధ్యలోనే ముందే నిలిపివేస్తున్నారు. కాకినాడ పోర్టు-చెంగల్‌పట్టు రైలు తెనాలిలో నిలిపివేస్తున్నారు. నర్సాపూర్‌-నాగర్‌సోల్‌ రైలును విజయవాడలో ఆగిపోనుంది. నర్సాపూర్‌-లింగంపల్లి రైలును విజయవాడలో నిలిపివేసున్నారు. బ్రాంచ్‌ లైన్‌ మీదుగా వెళ్లే కొన్ని రైళ్లను మెయిన్‌ లైన్‌ మీదుగా దారి మళ్లిస్తున్నారు. తిరుపతి-పూరి, పూరి-తిరుపతి, తిరుపతి-బిలాస్‌పూర్‌, బిలాస్‌పూర్‌-తిరుపతి, కాకినాడ టౌన్‌-బెంగళూరు, బెంగళూరు-కాకినాడ టౌన్‌, భువనేశ్వర్‌-సికింద్రాబాద్‌, విశాఖపట్నం-ముంబయి, సికింద్రాబాద్‌-భువనేశ్వర్‌,  రైళ్లను మెయిన్‌ లైన్‌ మీదుగా విజయవాడ, ఏలూరు, నిడదవోలు వరకు దారి మళ్లిస్తున్నారు.