AP New CS : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మరొకరి పేరు తెరపైకి వచ్చింది. కేంద్ర రక్షణశాఖ కార్యదర్శిగా ఉన్న గిరిధర్‌ అరమణే పేరు నూతన సీఎస్ లిస్ట్ లో వినిపిస్తుంది.  1988 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం కేంద్రం రక్షణశాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గిరిధర్‌ అరమణే ను కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు తెలుస్తోంది. నూతన సీఎస్ గా జవహర్ రెడ్డి పేరు వినిపించినా తాజాగా గిరిధర్ అరమణే రేసులోకి వచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో  గిరిధర్‌ అరమణే శనివారం భేటీ అయ్యారు. కొత్త సీఎస్‌ నియామకంపై కసరత్తు జరుగుతున్న సమయంలో ఈ భేటీపై చర్చ జరుగుతోంది.  


సీనియార్టీ జాబితాలో గిరిధర్ 


ఆంధ్రప్రదేశ్ కేడర్‌ కు చెందిన సీనియార్టీ అధికారుల జాబితాలో గిరిధర్‌ అరమణే రెండో స్థానంలో ఉన్నారు. గిరిధర్ అరమణే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపడితే 2023 జూన్‌ 30 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. కొత్త సీఎస్‌ నియామకంపై ఇవాళ, రేపటిలో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఈనెల 30న పదవీ విరమణ చేయబోతున్నారు. డిసెంబరు 1వ తేదీ నుంచి కొత్త సీఎస్ బాధ్యతలు చేపట్టాల్సిఉంటుంది. ముందు కొత్త సీఎస్‌గా జవహర్‌రెడ్డిని నియమించనున్నట్లు వచ్చిన వార్తలు తెలిసిందే. నూతన సీఎస్‌గా ఎవరిని నియమించాలనే విషయంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నూతన సీఎస్ నియామకంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 






సీఎస్ నియామకంపై సందిగ్ధత 


పార్టీతోపాటు ప్రభుత్వంలోనూ సీఎం జగన్ భారీగా మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే పార్టీలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంలో కొన్ని మార్పులు చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా ముఖ్యమైన సీఎస్ నియామకంపై సీఎం ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఏపీ సీఎస్‌గా ఉన్న సమీర్‌ శర్మ మరో నాలుగు రోజుల్లో పదవీ విరమణ చేశారు. ఆయన ప్లేస్‌ ఎవర్ని తీసుకురావాలన్న డిస్కషన్‌ ప్రభుత్వంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. వచ్చేది ఎన్నికల సంవత్సరాలు కాబట్టి ఆ దిశగానే నియామకం ఉంటుందన్న టాక్ నడుస్తోంది. ఈ పదవికి చాలా మంది ఐఏఎస్‌లు పోటీలో ఉన్నారు. ఈ పోటీలో  సీఎం స్పెషల్ సెక్రెటరీగా ఉన్న జవహర్‌రెడ్డి వినిపించింది. ఆయన వైపే సీఎం జగన్ మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఏ క్షణంలోనైనా ఆయన నియామక జీవో రిలీజ్ అయ్యే ఛాన్స్‌ ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయని లీక్ లు వచ్చాయి. కానీ లాస్ట్ మినిట్ లో మరో పేరు తెరపైకి వచ్చింది. కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమణే పేరు పైకి వచ్చింది. ఆయన సీఎం జగన్ తో భేటీ అవ్వడంతో లెక్కలు మారిపోయాయి. శ్రీలక్ష్మి, జవహర్ రెడ్డి, తర్వాత గిరిధర్ అరమణే పేరు సీఎస్ జాబితాలో చేరింది.