Ayodhya Ram Mandir Pran Pratishtha: తిరుపతి: ఎన్నో శతాబ్ధాల కల మరో రెండు రోజుల్లో నెరవేరనుంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్య శ్రీరామమందిరం (Ram Mandir)లో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్టాపన కార్యక్రమం జ‌న‌వ‌రి 22వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగనుంది. ఈ సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛాన‌ల్ (SVBC) తమిళం, కన్నడ, హిందీ ఛాన‌ళ్లలో ప్రత్యక్షప్రసారం చేయనుంది. అదే విధంగా ఎస్వీబీసీ తెలుగు యూట్యూబ్ ఛాన‌ల్‌ ద్వారా అయోధ్యలో జరిగే వైదిక, ఆధ్యాత్మిక క్రతువులను నిరంతరాయంగా ప్రత్యక్షప్రసారం చేయనుంది.


భక్తులు ఈ విషయాలను గమనించి ఎంతో వైభవంగా, ఆగమోక్తంగా జరిగే అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాలను ఎస్వీబీసీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఛాన‌ళ్లలో వీక్షించి తరించాలని భక్తలోకానికి టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఎస్వీబీసీ తెలుగు ఛాన‌ల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు అయోధ్య కార్యక్రమాలు ప్రత్యక్షప్రసారం కానున్నాయి. అనంతరం 12 గంటల నుండి తిరుమల శ్రీవారి కల్యాణం యధావిధిగా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఆ తరువాత అయోధ్యలో మధాహ్నం 12 గంటల నుండి జ‌రిగే కార్యక్రమాలను శ్రీ‌వారి క‌ల్యాణం అనంత‌రం తిరిగి ప్ర‌సారం చేస్తారు. టీటీడీ అధికారి ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. 


పెద్ద స్క్రీన్లపై లైవ్‌లో చూసే అవకాశం
అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్టను ప్రత్యక్షంగా చూసేందుకు లక్షలాది మంది అయోధ్యకు చేరుకుంటున్నారు. కోట్లాది ప్రజలు టీవీల్లో చూసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న టీవీ ఛానెళ్లు లైవ్ ఈ మహత్తర కార్యక్రమాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నాయి. అంతేకాదు ప్రముఖ మల్టీప్లెక్స్‌ సంస్థలు పీవీఆర్‌(PVR), ఐనాక్స్‌(INOX)లు అయోధ్య రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట వేడుకలను పెద్ద స్క్రీన్లపై చూసే అవకాశం కల్పిస్తున్నాయి. రూ.100 టికెట్‌తోనే థియేటర్లలో కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. 


121 మందితో ప్రాణ ప్రతిష్ట
అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి 8 వేల మంది అతిథులు హాజరవుతారని అంచనా. వీరిలో కొద్ది మందిని మాత్రమే గర్భాలయంలోకి అనుమతిస్తామని ఆలయ కమిటీ పేర్కొంది. గణేశ్వర్‌ శాస్త్రి ద్రవిడ్‌ ఆధ్వర్యంలో 121 మంది ఆచార్యులు ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తారని కమిటీ వెళ్లడించింది. ఈ కార్యక్రమాలకు కాశీకి చెందిన లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ ప్రధాన ఆచార్యుడిగా వ్యవహరించబోతున్నారు.