Supreme Court on AP sand irregularities : ఆంధ్రప్రదేశ్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ ఇసుక తవ్వకాలు ఉండకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీం ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా అక్రమ ఇసుక తవ్వకాలు సాగటంపై మండిపడింది. అక్రమ ఇసుక తవ్వకాలను నిలిపివేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. కమిటీలో కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులను కూడా నియమించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.
నాలుగు రోజుల్లో ఇసుక రీచ్‌లలో తవ్వకాల నిలిపివేతకు చర్యలు
నాలుగు రోజుల్లోపు అక్రమ ఇసుక రీచ్‌లను సందర్శించి వాటిని నిలిపివేయడానికి తగిన చర్యలను తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి జిల్లాలో ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక సెల్ లను కూడా ఏర్పాటు చేయాలని సుప్రీం ఆదేశించింది. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్లు, ఈ మెయిల్ ఐడీలను కూడా ఏర్పాటు చేయాలని..వాటికి పబ్లిసిటీ ఇవ్వాలన్నారు. తమ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కోర్టు థిక్కార చర్యలను తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కమిటీలోని అధికారులు సుప్రీంకోర్టు నియమించిన అధికారులుగా గుర్తుంచుకోవాలని.. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన
ఏపీలో యథేచ్చగా అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ధృవీకరించింది. ఆ మేరకు మధ్యంతర నివేదికను సమర్పించింది. 10 వేల కోట్ల రూపాయల మేరకు అక్రమ ఇసుక రవాణా జరిగిందని ప్రతివాది తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న అక్రమ ఇసుక తవ్వకాలను ఫోటోలు, ఆధారాల సహా ప్రతివాది దండా నాగేంద్ర కుమార్ నేడు సుప్రీం ముందు ఉంచారు. అక్రమ ఇసుక తవ్వకాలను తక్షణం నిలిపివేయడానికి వెంటనే అధికారుల బృందాలను క్షేత్ర స్థాయికి పంపాలని గత వారం సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అధికారులు కూడా క్షేత్ర స్థాయికి వెళ్లి అక్రమ ఇసుక తవ్వకాలు ఆపేశారా.. లేదా? అన్నది తనిఖీ చేయాలని కూడా సుప్రీం ఆదేశించింది.
ప్రభుత్వ అఫిడవిట్ ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
ఇసుక అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. ఏపీ ప్రభుత్వం చర్యలన్నీ కాగితాలకే పరిమితమని తమకు తెలుసని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. నేడు సుప్రీంకోర్టు అక్రమ ఇసుక తవ్వకాల నిలిపివేతపై తీసుకున్న చర్యలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు ఇంకా కొనసాగుతున్నాయంటూ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ కూడా సుప్రీంకోర్టుకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఏపీలో ఇసుక వ్యవహారం ప్రతీ సారి సంచలనంగా మారుతోంది.