Hetero Jagan Case :  వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో తమపై దాఖలైన కేసును క్వాష్ చేయాలంటూ హెటెరో దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసి పుచ్చింది. సీబీఐ పక్కాగా చార్జిషీటు దాఖలు చేసిందని.. ఇవన్నీ దాచేస్తే దాగని సత్యాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. కేసును కొట్టి వేయాలన్న హెటిరో అభ్యర్థనను తిరస్కరించింది. ఈ కేసులో హెటెరో కంపెనీ విచారణ ఎదుర్కోవాల్సిందేనని తెలిపింది. గత ఏడాది నవంబర్‌లో తెలంగాణ హైకోర్టు  జగన్ అక్రమాస్తుల కేసులో హెటిరో డైరెక్టర్‌ ఎం.శ్రీనివాస్‌రెడ్డితో పాటు హెటిరో గ్రూప్‌ను కేసు నుంచి తొలగించేందుకు నిరాకరిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో హెటిలో సవాల్ చేసింది. 


అరబిందో, హెటిరో సంస్థలకు జడ్చర్ల సెజ్‌లో భూ కేటాయింపుపై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో శ్రీనివాస్‌రెడ్డి, హెటిరో సంస్థను నిందితుల జాబితాలో సీబీఐ చేర్చింది. సీబీఐ అభియోగాల్లో నిజం లేదని, జగన్‌ సంస్థల్లో పెట్టుబడులు వ్యాపార వ్యూహాల్లో భాగమేనని, భూ కేటాయింపుల్లో అక్రమాలేవీ జరగలేదని హెటిరో తరపు న్యాయవాదులు  వినిపించారు. జగన్‌ ప్రమేయంతో అప్పటి వైఎస్‌ సర్కారు హెటిరో సంస్థకు తక్కువ ధరకు భూమిని కేటాయించిందని సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.  ‘జగతి సంస్థలో  జగన్ రూపాయి కూడా  పెట్టుబడి పెట్టకుండానే ఇతరులతో రూ.1246 కోట్లు పెట్టుబడిగా పెట్టించారు. ఇందుకోసం తండ్రి అధికారాన్ని ఉపయోగించుకున్నారని సీబీఐ వాదిస్తోంది. 


 జగన్, విజయసాయిరెడ్డి ప్రణాళిక ప్రకారం కుట్రపూరితంగా వ్యవహరించారు. తండ్రి అధికారాన్ని ద్వారానే హెటిరో, తదితర కంపెనీలకు లబ్ధి చేకూర్చి, వారిచ్చే ముడుపులనే.. జగన్ తన సంస్థల్లోకి పెట్టుబడులు మళ్ళించారు’ అని సీబీఐ చార్జిషీటులో తెలిపింది.   ఈ విషయాన్ని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ  స్వయంగా ధ్రువీకరించిందని, హెటిరో హెల్త్ కేర్ లో జరిపిన తనిఖీల్లో ఈ పెట్టుబడులకు సంబంధించిన వివరాలు బయటపడ్డాయని సీబీఐ కోర్టుకు తెలిపింది.  జగన్ సంస్థల్లో హెటిరో   2006, 2007లో  రెండు దఫాలుగా పెట్టుబడి పెట్టిందని..  అదే సమయంలో  ఆ సంస్థకు  వైఎస్ ప్రభుత్వం  50 ఎకరాలు  కేటాయించిందని సీబీఐ చెబుతోంది.  2008లో  మరోసారి పెట్టుబడి పెట్టిన తర్వాతే  ..  75 ఎకరాల భూమి కేటాయించారన్నారు.  ఈ వ్యవహారంలో హెటిరో  ఎండి శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్ర పోషించారు కాబట్టే.. ఆయన నిందితుడిగా చేర్చామని స్పష్టం చేశారు.  
 
 జగతిలో వాటాలను ఇతరులకు అమ్మడానికి వీల్లేదని, వాటాదారులు కుటుంబసభ్యులకు మాత్రమే బదలాయించాలన్న షరతు ఉంది. వాటాలను విక్రయించుకోలేకుండా, లాభాలు లేకుండా పెట్టుబడులు పెట్టారు. హెటిరో రూ.1,173 కోట్లకు పైగా పెట్టుబడి పెడితే.. వారికి దక్కింది కేవలం 30 శాతమే! జగన్‌ కేవలం రూ.73 కోట్ల పెట్టుబడితో 70 శాతం వాటా పొందారు. ఆ రూ.73 కోట్లు కూడా ఆయనకు చెందిన కార్మెల్‌ ఏసియా, సండూర్‌ పవర్‌ల నుంచి వచ్చాయి. వాటిలోనూ ఇతరులే పెట్టుబడులు పెట్టారు. అంటే.. రూపాయి వెచ్చించకుండా రూ.1,246 కోట్ల పెట్టుబడులను జగన్‌ రాబట్టారు. అధికార దుర్వినియోగం, ప్రజా విశ్వసనీయతను దెబ్బతీయడం.. అవినీతి నిరోధక చట్ట పరిధిలోకి వస్తాయని సీబీఐ వాదిస్తోంది.