Jagan Illigal Assests Case  :  జగన్ అక్రమాస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్‌, భారతి సిమెంట్స్‌,  వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.  సీబీఐ కేసుల విచారణ తేలే వరకు ఈడీ కేసుల విచారణ ఆపాలంటూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌  సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈడీ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం సెప్టెంబరు 5లోగా సమాధానం చెప్పాలని ప్రతివాదులుగా ఉన్న విజయసాయిరెడ్డి, భారతీ సిమెంట్స్‌, జగతి పబ్లికేషన్స్‌కు నోటీసులు ఇచ్చింది.  


సీబీఐ నమోదు చేసిన కేసులు, ఈడీ నమోదు చేసిన కేసులు సమాంతరంగా విచారణ కొనసాగించవచ్చునని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ ధర్మాసనం కొట్టివేసింది. హైదరాబాబ్‌ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తుది ఆదేశాలపై 2021లో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును ఈడీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓఖా, జస్టిస్‌ సంజయ్‌ కరోలలతో కూడిన ధర్మాసనం సెప్టెంబర్ 5వ తేదీలోపు సమాధానం చెప్పాలని ప్రతివాదులుగా ఉన్న విజయసాయిరెడ్డి, భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్‌‌లకు నోటీసులు జారీ చేసింది.              


ఈ కేసు పూర్తి స్థాయి విచారణ సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం చేపట్టాలా.. లేక త్రిసభ్య ధర్మాసనం చేపట్టాలన్నది ఆరోజు నిర్ణయిస్తామని ధర్మాసనం పేర్కొంటూ.. సెప్టెంబర్ 5వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది. అదే సమయంలో జగన్‌ అక్రమాస్తుల కేసులో భాగంగా జప్తు చేసిన భారతి ఆస్తుల విడుదలకు గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈడీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈ కేసు విచారణ ఈనెల 14న సుప్రీంకోర్టులో జరగనుంది. జప్తు ఆస్తులకు సమాన విలువైన ఎఫ్‌డీలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


 ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని క్విడ్ ప్రోకో ద్వారా భారీ ఎత్తున ఆర్ధిక అక్రమాలకు పాల్పడినట్లు జగన్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఇందులో జగన్ తో పాటు పలువురు మాజీ మంత్రులు, వైసీపీ నేతలు, అధికారులు నిందితులుగా ఉన్నారు. దాదాపుగా పదేళ్లుగా సీబీఐతో పాటు ఈడీ కూడా ఈ కేసుల్ని దర్యాప్తు చేస్తున్నాయి. దర్యాప్తు పూర్తయిన కేసుల్లో సీబీఐతో పాటు ఈడీ కూడా పలు ఛార్జిషీట్లు దాఖలు చేశాయి. వీటిపై త్వరలో సీబీఐ కోర్టులో విచారణ ప్రారంభం కావాల్సి ఉంది. నిందితులు తరచూ డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేస్తూండటంతో విచారణ ఆలస్యం అవుతోంది. అయితే గత విచారణలో సీబీఐ కోర్టు.. డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ నెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్ణయించింది.