Bail For AP MLC : మాజీ డ్రైవర్ హత్య కేసులో నిందితడిగా ఉన్న ఏపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. డీఫాల్ట్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు అనంతబాబు. గతంలో విచారణకువచ్చిన సమయంలో ప్రతి వాదులకు నోటీసులు జారీ చేశారు. సోమవారం జరిగిన విచారణలో బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బెయిల్ షరతులను కింది కోర్టు నిర్ణయించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే అనంతబాబు బెయిల్ పిటిషన్ ను రాజమండ్రిలోని ఎస్సీ ఎస్టీ కోర్టు, ఏపీ హైకోర్ట్ కొట్టి వేశాయి. దీంతో బెయిల్ కోసం అనంతబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
డీఫాల్ట్ బెయిల్‌కు అనంతబాబు అర్హుడని సుప్రీంకోర్టులో అనంతబాబు లాయర్ వాదన
గత విచారణలో అనంతబాబును అరెస్టు చేసి 90 రోజులు దాటిపోయిందని ఆయన తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు దర్యాప్తు పూర్తి చేయడం లేదన్నారు. ఫోరెన్సిక్ నివేదికలని మరో కారణం చెప్పి చార్జిషీట్ దాఖలు చేయడం లేదన్నారు. ఆగస్టు 26న ట్రయల్ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా నిందితుడికి మరో 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించాలని.. ఈలోగా చార్జిషీట్ దాఖలు చేస్తామని పోలీసులు చెప్పారన్నారు. కానీ ఇప్పటి వరకు చార్జిషీట్ దాఖలు చేయలేకపోయారని అన్నారు. ఈ పరిస్థితుల్లో అనంత బాబు డిఫాల్ట్ బెయిల్ పొందేందుకు అర్హుడని, ఆయనకు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతబాబు తరపు లాయర్ వాదనలతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించింది.
బెయిల్ కుటుంబానికి రక్షణ ఉండదని సుబ్రహ్మణ్యం కుటుంబం లాయర్ వాదన
అనంతబాబుకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని హత్య జరిగిన తర్వాత మృతదేహాన్ని బాధిత కుటుంబానికి అప్పగించి, రూ. 2 లక్షలు డబ్బులిచ్చి, ఎక్కడా మాట్లాడొద్దంటూ బెదిరింపులకు పాల్పడ్డారని డ్రైవర్ సుబ్రహ్మణ్యం తరపు లాయర్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బెయిలిస్తే కేసులో సాక్షులను, బాధిత కుటుంబాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదనలు వినిపించారు. ఈ పరిస్థితుల్లో అనంతబాబుకు బెయిల్ ఇవ్వొద్దంటూ విజ్ఞప్తి చేశారు. అయితే తామేమీ అనంత బాబును నిర్దోషిగా ప్రకటించడం లేదని, అయితే 90 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేయకపోతే డిఫాల్ట్ బెయిల్‌కు అర్హులవుతారని చెప్పింది. ఆ వాదనల ప్రకారం ఇప్పుడు డీఫాల్ట్ బెయిల్‌ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది.
మే 19న సుబ్రహ్మణ్యం హత్య - ఎమ్మెల్సీని సస్పెండ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
ఎమ్మెల్సీ అనంత బాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి, ఆ తర్వాత మృతదేహాన్ని బాధితుడి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ఘటన ఏపీలో కలకలం రేపింది. మే 19వ తేదీన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను ఆయన ఇంటి నుంచి అనంతబాబు తీసుకెళ్లారు. అదే రోజు ప్రమాదంలో చనిపోయారని మృతదేహాన్ని ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ సుబ్రహ్మణ్యం బంధువులు అడ్డుకున్నారు. అయితే అందర్నీ బెదిరించి ఆయన అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన కలకలం రేపడంతో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఎమ్మెల్సీని అరెస్ట్ చేశారు. తాను ఒక్కడినే సుబ్రహ్మణ్యాన్ని హత్య చేశానని అంగీకరించినట్లుగా పోలీసులు ప్రకటించారు. అయితే ఈ కేసులో ఇంత వరకూ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయలేకపోయారు. ఎమ్మెల్సీ అనంతబాబును వైఎస్ఆర్‌సీపీ నుంచి అప్పుడే సస్పెండ్ చేశారు.
కేసును సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
అనంతబాబు కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. దర్యాప్తు చేయడం లేదని.. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో ఇలా చేస్తున్నారని.. అందుకే కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలన్న విజ్ఞాపనతో ప్రస్తుతం హైకోర్టులో ఓ పిటిషన్ విచారణలో ఉంది.