Sand mining in AP: ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన వెలువరించింది.  ఇసుక తవ్వకాలపై ఎటువంటి నిషేధం లేదని జగన్ సర్కార్ స్పష్టం చేసింది..


సుప్రీం తీర్పు పై ప్రభుత్వం వివరణ..
రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలపై ఎటువంటి నిషేధం లేదని రాష్ట్ర గనులశాఖ సంచాలకులు విజి వెంకటరెడ్డి  స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలోని అరణీయార్ నదీ పరీవాహక ప్రాంతాల్లో బి-2 (సెమీ మెకనైజ్డ్) కేటగిరిలో 18 ఒపెన్ ఇసుక రీచ్ లకు ఇచ్చిన అనుమతులను న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు రద్దు చేశామని తెలిపారు. ఈ రీచ్ లకు సంబంధించి తాజాగా మరో సారి అన్ని రకాల పర్యావరణ అనుమతులను సంస్థ తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. అనుమతులు క్లియరెన్స్ వచ్చిన తరువాతనే 18 రీచ్ ల్లో ఇసుక తవ్వకాలు చేసుకోవచ్చని తెలిపారు. అంతే కాదు పర్యావరణానికి విఘాతం కలిగించేలా వ్యవహరించారంటూ ఈ 18 రీచ్ లపై ఎన్జీటి విధించిన జరిమానాకు సుప్రీంకోర్ట్ స్టే ఉత్తర్వులు జారీ చేసిందని వెల్లడించారు. 


ఆ కేటరిగిల్లో.....
రాష్ట్రంలో బి1, బి2 కేటగిరిల్లో ఇప్పటికే జారీ చేసిన పర్యావరణ అనుమతులను కూడా పర్యావరణశాఖ పున: సమీక్షించాలని కూడా న్యాయస్థానం సూచించిందని  విజి వెంకటరెడ్డి వివరించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మెరుగైన ఇసుక పాలసీని అమలు చేస్తోందని, దీనిలో భాగంగా పర్యావరణానికి ఎక్కడా విఘాతం కలగకుండా అన్ని అనుమతులు ఉన్న రీచ్ ల్లో మాత్రమే ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. చిత్తూరు జిల్లాలోని 18 ఇసుక రీచ్ లకు సంబంధించి ఎన్జీటిలో దాఖలైన కేసుల నేపథ్యంలో సుప్రీంకోర్ట్ ఆదేశాల మేరకు వాటిల్లో తవ్వకాలను పూర్తిస్థాయిలో నిలిపివేయాలని గనులశాఖ ఆదేశించిందని తెలిపారు. 


ఇసుక కొరత లేకుండా చర్యలు...
రాష్ట్రంలో వర్షాకాలంలో ఇసుక కొరత ఏర్పడకుండా, భవన నిర్మాణ రంగానికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్  ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం మేరకు అన్నిచోట్ల ఇసుక నిల్వలను అందుబాటులో ఉంచుతున్నామని రాష్ట్ర గనులశాఖ సంచాలకులు  తెలిపారు. వర్షాల వలన నదులు, జలాశయాల్లో ఇసుక తవ్వకాలకు విఘాతం ఏర్పడుతుందని, దీని వల్ల నిర్మాణ పనులు నిలిచిపోయే ప్రమాదం ఉందని అన్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఎండా కాలంలోనే ఇసుక నిల్వలను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. 


ఏపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం..
ఇసుక తవ్వకాల విషయంలో ప్రభుత్వంపై అనవసరసంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర గనులశాఖ సంచాలకులు  విజి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పు, ఎన్టీటీ సూచనలు పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం అన్ని విధాలుగా ముందస్తు అనుమతులుతో ఇసుక వ్యవహరం పని చేస్తుందని తెలిపారు.  పర్యావరణ శాఖ నుంచి అన్ని అనుమతులు లభించిన రీచ్ ల్లో మాత్రమే ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నామని, ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే వెంటనే చర్యలు కూడా తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. సామాన్యుడికి ఇసుకను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించింది కాబట్టే, జలాశయాల్లో నీరు వచ్చినా ఇసుక కు ఎటువంటి కొరత లేదని ఆయన వివరించారు.