YS Viveka Case : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్‌కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సునీల్ యాదవ్ తండ్రి కఅష్ణయ్య పులివెందులలో మరణించడంతో అంతిమ సంస్కారాలకు రెండు వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని హైకోర్టును సునీల్ యాదవ్ కోరారు. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు శని, ఆదివారం, తర్వాత ఈనెల 17,18 తేదీల్లో ఇద్దరు ఎస్కార్ట్ సిబ్బంది, వాహనంతో పులివెందుల వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. వాహనం, ఎస్కార్ట్ సిబ్బంది ఖర్చును సునీల్ యాదవే భరించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సునీల్ యాదవ్ మధ్యంతర బెయిల్ గడువు ముగియగానే కోర్టులో లంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. పూర్తి బెయిల్ ఇవ్వాలంటూ సునీల్ యాదవ్ గతంలో దాఖలుచేసిన పిటిషన్‌పై శుక్రవారం వాదనలు జరిగాయి. దర్యాప్తు పూర్తయినందున బెయిల్ ఇవ్వాలని నిందితుడి తరఫు న్యాయవాది కోరగా.. దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున జైల్లోనే ఉంచాలని సీబీఐ వాదించింది. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు.. సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది.
వివేకా హత్య కేసులో ఏ2గా సునీల్ యాదవ్ ఉన్నారు. ఆయన గోవాకు పారిపోతే గూగుల్ ట్రాకింగ్ ద్వారా పట్టుకొని అరెస్టు చేయాల్సి వచ్చిందని సీబీఐ ఇప్పటికే ప్రకటించింది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో కూడా సునీల్ పాత్ర వివరించారని తెలిపారు. ఈ కేసులో సునీల్ పాత్రను నిర్దారిస్తూ చాలా కీలకమైన ఆధారాలు ఉన్నాయని హైకోర్టుకు సీబీఐ తెలిపింది. వివేకా హత్య ఘటనకు ముందు సునీల్ యాదవ్ ఓ శక్తిమంతమైన నేత ఇంట్లో ఉన్నారని ... వివేక హత్యకు ప్లానింగ్, అమలు, అనంతర పరిణామాల్లో సునీల్ పాత్ర ఉందని సీబీఐ ఆరోపిస్తోంది.
వివేకానందరెడ్డిని అవినాశ్ రెడ్డి అడ్డు తొలగించుకోవాలని అనుకోవడానికి, తన ఎంపీ సీటుకు అడ్డు రావడమే కారణమని సీబీఐ పేర్కొంది . హత్య జరిగిన రోజు అర్ధరాత్రి ఒకటిన‌్నర గంటల ప్రాంతంలో సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి వెనుకవైపు కాంపౌండ్ దాటి.. వివేకా ఇంట్లోకి ప్రవేశించారని, దీనికి గంగిరెడ్డి సహకరించాడని తెలింపింది.అనువుగాని సమయంలో.. వారు ఎందుకొచ్చారంటూ వివేకా ప్రశ్నించగా.. డబ్బు లావాదేవీలు మాట్లాడటానికి వచ్చారని గంగిరెడ్డి ఆయనకు సర్దిచెప్పినట్లు తెలిపింది. కాసేపటికే సునీల్ యాదవ్.. దుర్భాషలాడుతూ వివేకా ఛాతిపై కొట్టడం ప్రారంభించగా.. దస్తగిరి నుంచి ఉమాశంకర్‌రెడ్డి గొడ్డలి తీసుకుని నుదుటిపై దాడి చేసినట్లు పేర్కొంది. ఆ తర్వాత డ్రైవర్ ప్రసాద్.. తనను కొట్టినట్లు వివేకాతో బలవంతంగా లేఖ రాయించి.. బాత్‌రూంలోకి తీసుకెళ్లి వివేకా తలవెనుక ఏడెనిమిదిసార్లు ఉమాశంకర్‌రెడ్డి గొడ్డలితో దాడి చేసినట్లు.. వివరించింది. సునీల్ యాదవ్ వివేకా మర్మాంగాలపై తన్నాడని, ఆ తర్వాత వారు అక్కడ నుంచి వెళ్లిపోయారని.. సీబీఐ పేర్కొంది. వివేకా ఇంటి వాచ్‌మన్ రంగన్న..నిందితులను గుర్తించారని,.. సాక్ష్యాల ధ్వంసంలోనూ శివశంకర్‌రెడ్డి పాత్ర ఉందని స్పష్టం చేసింది.