Food Poison In Araku District: ఫుడ్ పాయిజన్‌తో 50 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన అల్లూరి జిల్లాలోని (Alluri District) ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అరకులోయ నియోజకవర్గం డుంబ్రిగుడ (Dumbriguda) మండలం బొందుగూడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రాత్రి 50 మంది విద్యార్థులు రాత్రి ఆహారం తిని వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వీరిని గమనించిన సిబ్బంది వెంటనే వారిని అరకులోయలోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పాడేరు డీఎంహెచ్‌వో జమాల్ భాషా ఆస్పత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థినుల పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ముగ్గురికి డీహైడ్రేషన్ ఎక్కువగా ఉందని.. వారిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. కొందరు విద్యార్థులకు హాస్టల్‌లోనే చికిత్స అందిస్తున్నామని.. ఆస్పత్రిలో విద్యార్థుల పరిస్థితి కూడా బాగానే ఉందని ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపారు.


సీఎం ఆరా


మరోవైపు, ఈ ఘటనపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆరా తీశారు. సీఎంవో అధికారులు జిల్లా అధికారులతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉందని వారికి స్థానిక అధికారులు వివరించారు. అటు, నూజివీడు ట్రిపుల్ ఐటీలోనూ గత వారం రోజులుగా ఫుడ్ పాయిజన్‌తో వందల మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు.


Also Read: Pensions: భారీ వర్షంలో పెన్షన్ల పంపిణీకి ఇబ్బందులు - సచివాలయ సిబ్బందికి సీఎం చంద్రబాబు వెసులుబాటు