ఆంధ్రప్రదేశ్ పీఆర్సీ సాధన సమితి నిర్వహించాలనుకున్న " చలో విజయవాడ" ర్యాలీకి ప్రభుత్వం నుంచి తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. మంగళవారం జరిగిన చర్చలు విఫలం కావడంతో "చలో విజయవాడ" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకున్నాయి. అయితే చలో విజయవాడకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు.
ఉద్యోగులపై పలు రకాల ఒత్తిళ్లు
జిల్లాల నుంచి ఎవరూ ఉద్యోగులు విజయవాడకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాల్లో ఉద్యోగ సంఘాల నేతలకు కలెక్టర్ల ద్వారా హెచ్చరికలు పంపించినట్లుగా తెలుస్తోంది. పలు జిల్లాల్లో ఉన్నతాధికారులు ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ గురువారం ఆఫీసుకు రావాల్సిందేనని ఆదేశిస్తున్నారు. చాలా వరకు ఉద్యోగులు సెలవు పెట్టారు. అయితే సెలవులు అంగీకరించే ప్రశ్నే లేదని సమాధానం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల ముందు నుంచే గృహనిర్బంధం చేయడంతో అనేక జిల్లాల ఉద్యోగ సంఘం నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వాలంటీర్ల ద్వారా ఉద్యోగులపై నిఘా
మరో వైపు అన్ని జిల్లాల నుంచి విజయవాడకు వచ్చే మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒక రోజు ముందు నుంచే జిల్లాల్లో వివిధ ఉద్యోగ సంఘాల నేతలను నిర్బంధిస్తున్నారు. విజయవాడకు వెళ్లకుండా ఉద్యోగ సంఘాల ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఉద్యోగ సంఘాల నాయకుల ఇళ్ల అడ్రెస్‌లను పోలీసులు సేకరించి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. విజయవాడకు వెళ్లేవారి వివరాలు సేకరించాలని వాలంటీర్లకు సమాచారం అందించారు. ఉద్యోగులు ఎవరైనా ఉత్తర్వులు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
విజయవాడలో పోలీసుల కఠిన ఆంక్షలు
పోలీసులు ర్యాలీ నిర్వహించాలనుకున్న బీఆర్టీఎస్ రోడ్డులో వందల కొద్దీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఉద్యోగులు ఎవరూ నిబంధనలు ఉల్లంఘించవద్దని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా హెచ్చరించారు. విజయవాడ నగరంలో భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని... ప్రస్తుతం అమలులో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ ఉత్తర్వులు మరియు గైడ్ లైన్స్ ప్రకారం అవుట్ డోర్ లొకేషన్‌లలో 200 మందికి మించరాదు. మరియు ఇండోర్ లొకేషన్‌లలో 100 మందికి మించకుండా సభలు జరగాలన్నారు. ఐదు వేల మంది కంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమానికి తరలి వచ్చే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు.
అసాంఘిక శక్తులు చొరబడతాయని పోలీసుల అనుమానాలు
చలో విజయవాడ కార్యక్రమంలో ఉద్యోగస్తులతో సంబంధం లేని కొంతమంది బయటి వ్యక్తులు.. అసాంఘిక శక్తులు చొరబడి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.విజయవాడ నగరంలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ మరియు 144 సీఆర్పీసీ ప్రొసీడింగ్స్ కూడా అమలులో ఉన్నాయని దీని ప్రకారం 5మంది కంటే ఎక్కువ ఒక చోట ఉండకూడదని పోలీసులు ప్రకటించారు.
అందర్నీ అరెస్ట్ చేసినా పది మందితో అయినా సరే చలో విజయవాడ నిర్వహిస్తామన్న ఉద్యోగ నేతలు !
ప్రభుత్వ నిర్బంధంపై ఉద్యోగ సంఘాలు స్పందించాయి. నిర్బంధంతో పోరాటాన్ని ప్రభుత్వం ఆపలేదని, చలో విజయవాడను విజయవంతం చేస్తామని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఉద్యోగ కార్యాచరణ యథావిధిగా కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు పెట్టినా చలో విజయవాడ విజయవంతం చేస్తామంటున్నారు. అనుమతి ఇవ్వాలని పోలీసుల్ని మరోసారి కోరారు. కానీ ఇచ్చే అవకాశం లేకపోవడంతో అందర్నీ అరెస్ట్ చేసినా పది మందితో అయినా బీఆర్‌టీఎస్‌లో చలో విజయవాడ నిర్వహించి తీరుతామని అంటున్నారు. అటు పోలీసులు ఇటు ఉద్యోగుల పట్టుదలతో విజయవాడలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.