Vijayawada Court News :   సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి మీద రాయిదాడి కేసులో నిందితుడు సతీష్ కు విజయవాడ కోర్టు బెయిల్ ఇచ్చింది.   విజయవాడలోని 8వ అదనపు జిల్లా న్యాయస్థానంలో నిందితుడు సతీష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తి కావడంతో తీర్పు వెలువరించారు. ప్రతి శని, ఆదివారాల్లో స్థానిక పోలీస్ స్టేషన్‌లో సంతకం పెట్టాలని ఆదేశించింది. ప్రస్తుతం నిందితుడు సతీష్ నెల్లూరు జైల్లో ఉన్నారు.  పేపర్ వర్క్ పూర్తి చేసిన తర్వాత ఆయనను విడుదల చేసే అవకాశం ఉంది.                   

  


సతీష్ అసలు రాయి విసరలేదని  పోలీసులు ఈ కేసులో అతన్ని ఇరికించారని సతీష్ తరపు లాయర్ వాదనలు వినిపించారు.  అయితే సతీష్ కావాలనే ముఖ్యమంత్రి మీద దాడి చేశారంటూ ప్రభుత్వం తరుఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఇక ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సతీష్ తరపు లాయర్ వాదనలతో ఏకీభవించి బెయిల్ మంజూరు చేశారు .                         
 
బస్సు యాత్రలో భాగంగా విజయవాడలోని డాబాకొట్ల సెంటర్ దగ్గర నిర్వహించిన రోడ్ షోలో సీఎం జగన్ పై రాయి దాడి జరిగింది. ఈ దాడిలో సీఎంకు స్వల్పగాయమైంది. ఈ ఘటనలో జగన్‌ మోహన్ రెడ్డి ఎడమ కంటిరెప్పపై భాగంలో గాయమైంది. భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ కావడంతో పాటు వైద్యులు ఆయనకు బస్సులోనే ప్రాథమిక చికిత్స చేసేశారు. ‌దీనిపై అజిత్ సింగ్ నగర్ పోలీసులు స్థానికుడు సతీష్ కుమార్అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.               


జగన్ పై రాయి దాడి కేసు రాజకీయంగానూ పెను సంచలనం అయింది. తగిలింది చిన్న గాయమే అయినా నేరుగా  హత్యాయత్నం కేసు పెట్టడం.. ఆ హత్యాయత్నం వెనుక టీడీపీ నేతలు ఉన్నారని వైసీపీ నేతలు ఆరోపణలు చేయడంతో విషయం ముదిరి పాకాన పడింది. బొండా ఉమ అనుచరుడు అయిన ఓ టీడీపీ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని నాలుగైదు రోజులు తమ వద్దే ఉంచుకుని వదిలి పెట్టారు. ఓ రోజు బొండా ఉమను అదుపులోకి తీసుకునేందుకు ఆయన కార్యాలయాన్ని చుట్టముట్టారు. తర్వాత ఏం జరిగిందో కానీ.. పోలీసులు రాజకీయ ప్రమేయంపై పెద్దగా ఆరోపణలు చేయడం లేదు. 


నిజానికి ఈ రాయి దాడి కేసులో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క రాయి ఇద్దర్ని ఎలా గాయపరుస్తందన్న ప్రశ్నలు వస్తున్నాయి. అసలు రాయి దొరకకపోవడం మరో సంచలనంగా మారింది. గతంలో కోడి కత్తి కేసు తరహాలో .  ఈ రాయి దాడి కేసు నిందితుు కూడా జైల్లో మగ్గిపోతారేమోనని ఆయన కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. బెయిల్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.