Srisailam Dam News: శ్రీశైలం జలాశయానికి సంబంధించిన డ్రోన్ వీడియోలు ఆకట్టుకుంటున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయం నిండు కుండలాగా మారింది. నీటిమట్టం బాగా పెరిగిపోతుండడంతో గత సోమవారం శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు ముందుగా నాలుగు గేట్లను తెరిచి నీటిని విడుదల చేశారు. ఇప్పుడు నాలుగు రోజుల్లో మొత్తం 10 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 


మొత్తం 12 గేట్లు ఉండగా ప్రస్తుతానికి 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తారు. 3,76,670 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం 3,95,162 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. అవుట్‌ ఫ్లో 4,36,902 క్యూసెక్కులుగా నమోదైంది. ఎడమ, కుడి గట్టు విత్యుత్ కేంద్రాల ద్వారా కూడా నీటిని దిగువకు వదులుతున్నారు.


శ్రీశైలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా శ్రీశైలం డ్యామ్‌ను సందర్శించారు. కృష్ణమ్మకు జల హారతి పట్టారు. నిండుకుండలా ఉన్న శ్రీశైలం జలాశయాన్ని చూసి సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ‘‘ప్రాణికోటి జీవనాధారమైన జలాలను ఇచ్చే నదులని దేవతలుగా భావించి పూజించే సంప్రదాయం మనది. నిండుకుండలా ఉన్న శ్రీశైలం జలాశయం వద్ద క్రిష్ణమ్మకు జలహారతిని ఇవ్వడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. కావాల్సినంతగా కురుస్తున్న వర్షాలు రైతుల కళ్లలో ఆనందం నింపుతున్నాయి. ఇది రాష్ట్రానికి శుభసూచకం’’ అని చంద్రబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.