Andhra News :  ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీఎం జగన్‌పై విశాఖ ఎయిర్‌ పోర్టులో జరిగిన కోడి కత్తి కేసు దాడి ఘటనపై ఎన్‌ఐఏ కోర్టులో విచారణ జరిగింది.  ఈ సందర్భంగా కోర్టుకు కోడి కత్తి శ్రీను, ఇరు పక్షాల న్యాయవాదులు హాజరయ్యారు. తనకు జైలు నుంచి విముక్తి కలిగించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కోడికత్తి కేసులో నిందితుడు జన్నుపల్లి శ్రీనివాస్ లేఖ రాశాడు.  ‘‘1610 రోజులుగా బెయిల్ లేకుండా జైలులోనే ఉంటున్నా. నేను ఇంకా ఎంత కాలం జైలులో ఉండాలో తెలియడం లేదు. విముక్తి కలిగించండి. నాపై నమోదు అయిన కేసును జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ విచారించి న్యాయం చేయాలి. నాకు న్యాయం చేయాలని అనేక మార్లు కోర్ట కు విన్నవించా. అయినా స్పందన లేకపోవడంతో లేఖ రాస్తున్నానని వేడుకున్నారు.  


గతంలో సీజేఐకి కోడికత్తి శీను తల్లి లేఖ 


కోడికత్తి శీను  తల్లి సావిత్రి ఇంతకముందు ఆ సమయంలో సీజేఐగా ఉన్న ఎన్వీ రమణ కు ఇదే విషయంపై లేఖ రాశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ కోర్టు కు పది కిలో మీటర్ల దూరంలో నివాసం ఉన్నారు. పదిహేను నిమిషాలు కేటాయిస్తే సాక్ష్యం చెప్పి వెళ్లవచ్చునని. ఉద్దేశపూర్వకంగా ఆయన తన న్యాయవాదులతో పిటీషన్లు వేయించారని శ్రీను తరపు లాయర్లు మీడియాతో వ్యాఖ్యానించారు.  ఎటువంటి కుట్ర కోణం లేదని ఎన్ఐఏ అధికారులు స్పష్టం చేశారు. అయినా కొత్తగా పిటిషన్ వేయడం వెనుక వేరే కారణాలు ఉన్నాయి. ఇక ప్రతి రోజూ విచారణ వేగవంతం చేసి కేసు ముగింపు పలకాలి. కాదంటే సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం కోరుతారమన్నారు. 


కోడికత్తి కేసులో అసలేం జరిగిందంటే ?


2018 అక్టోబర్ 25న 294వ రోజు పాదయాత్ర ముగించుకొని వైఎస్‌ జగన్‌  హైదరాబాద్‌ తిరిగి వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వీఐపీ లాంజ్‌లో ఉండగా.. వెయిటర్‌..సెల్ఫీ తీసుకుంటానని అంటూ వైఎస్‌ జగన్‌ వద్దకు వచ్చారు. అతను వస్తూనే.. వైఎస్‌ జగన్‌పై కోళ్ల పందెలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉన్న వైఎస్‌ జగన్‌ సహాయకులు దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ భుజానికి కత్తి తగలడంతో గాయమైంది.  చిన్న గాయం కావడంతో వెంటనే జగన్ విమానం ఎక్కి వెళ్లిపోయారు. హైదరాబాద్ చేరుకున్న తరవాత  సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరారు. ఆ ఆస్పత్రి వైద్యులు తొమ్మిది కుట్లేసినట్లుగా ప్రకటించారు. మూడు వారాల వరకూ రెస్ట్ తీసుకున్నారు. ఇది పెద్ద సంచలనం అయింది. 


2019లోనే చార్జిషీటు దాఖలు చేసిన ఎన్ఐఏ 


ఏపీ ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో జరుగుతున్న ద‌ర్యాప్తు మీద త‌మ‌కు అనుమానాలు ఉన్నాయని హైకోర్టులో వైసీపీ నేతలు పిటిషన్ వేయడంతో కేసును కోర్టు ఎన్ఐఏకు ఇచ్చింది.  విచారణ జరిపిన ఎన్‌ఐఏ 2019లోనే చార్జిషీటు దాఖలుచేసింది.  ఈ దాడి కేసులో మొదటి ముద్దాయిగా జనిపల్లి శ్రీనివాస రావును పేర్కొన్నారు. చార్జిషీటుతో పాటు నిందితుడు శ్రీనివాసరావు విశాఖ జైల్‌లో రాసుకున్న 22పేజీల లేఖను కూడా కోర్టుకు అందజేశారు.   ఈ కేసును రహస్యంగా విచారించాలని… విచారణకు సంబంధించిన వివరాలు మీడియాకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించ కూడదని.. మీడియా కూడా విచారణకు సంబంధించిన వివరాలు ప్రచురించ కూడదని అప్పట్లో ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.