శ్రీకాకుళం జిల్లాలో సరైన ఉపాధి లేక వందల కుటుంబాలు వలస వెళ్తుంటాయి. మరింత మెరుగైన జీవనోపాధి కోసం ఖండాంతరాలు దాటి వెళ్తుంటారు. ఇలా వందల మంది కుటుంబ పోషణ నిమిత్తం పెద్ద ఎత్తున సౌదీ అరేబియాలో పని చేసేందుకు తరలి వెళ్తున్నారు. అక్కడ పెట్రోల్ పైపులైన్లు, బంకులు, మాల్స్, వివిధ పరిశ్రమలతోపాటు భవన, రోడ్డు నిర్మాణ పనుల్లో ఎక్కువ మంది పని చేస్తున్నారు. రెండేళ్ల పాటు సౌదీ అరేబియాలో పని చేసి తిరిగి జిల్లాకు వస్తుంటారు. కొందరు అరబ్ షేక్‌ల ఇళ్లల్లో కూడా పనిచేస్తుంటారు.


వజ్రపుకొత్తూరు మండలంలోని అమలుపాడు, సైనూరు, ఉద్దాన రామకృష్ణాపురం, కంబాల రాయుడుపేట, కొత్తపేట, కొమరాలపేట, మందస మండలంలోని లోహరిబందతోపాటు జిల్లాలోని ఉద్దాన, మైదాన ప్రాంతాలకు చెందిన యువత ఆరు నెలల నుంచి రెండేళ్ల పాటు సౌదీ అరేబియాకు వివిధ పనుల నిమిత్తం తరలిపోతుంటారు. 


వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నాలు


సౌదీ అరేబియాలో పని చేసే వాళ్లకు నెలకు రూ.50 వేల నుంచి రెండు మూడు లక్షల వరకూ వేతనం వస్తుంది. అందుకే అక్కడకు వెళ్లి పని చేయాలనే ఆసక్తి చాలా మందిలో కనిపిస్తుంటుంది. వీరంతా కంపెనీలు, దళారుల ద్వారా వెళుతుంటారు. అలా వెళ్లిన వాళ్లు చాలా మంది అక్కడి వాతావరణానికి అలవాటు పడలేకపోతుంటారు. వెళ్లిన కొద్ది నెలలకే వచ్చేసేందుకు ట్రై చేస్తుంటారు. ఆ సందర్భంలోనే వాళ్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు.  


ఎడారి ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతకు తాళలేక కొందరు, యజమానుల వేధింపులకు తట్టుకోలేక మరికొందరు తిరిగి స్వదేశానికి వస్తుంటారు. రావడానికి సిద్ధపడే టైంలో యజమానులు అడ్డు చెప్పడంతో అసలు సమస్య మొదలవుతుంది. వాళ్ల అనుమతి లేకుండా వచ్చేందుకు ట్రై చేస్తే మాత్రం యజమానులు నరకం చూపిస్తుంటారు. యజమానులకు ఎదురు తిరిగారని తప్పుడు కేసులు బనాయించి జైళ్లకు పంపించడం, పాస్ పోర్టులు, వీసాలు తీసుకుని ఇబ్బందులకు గురి చేస్తుంటారు. వారు పెడుతున్న బాధలు పడలేక చాలామంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా, మరి కొందరు స్వదేశానికి వచ్చేందుకు నానా అవస్థలు పడుతున్నారు. 


సౌదీలో గాయపడి.. ఇంటికి రాలేక..


అలా సౌదీ వెళ్లి ఇబ్బందులు పడ్డవారిలో వజ్రపుకొత్తూరు మండలం కొల్లిపాడు గ్రామానికి చెందిన పుచ్చా కూర్మారావు ఒకరు. సౌదీ అరేబియాలో పనులు చేస్తూ... నిత్యం కుటుంబీకులతో ఫోన్లో మాట్లాడేవాడు. ఏమైందో తెలియదు గానీ గత కొద్ది నెలల నుంచి ఇంటికి ఫోన్ చేయడం లేదు. వారు చేసినా అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. దీంతో కూర్మారావు ఏమయ్యాడో తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 


ఉద్దానం గోపినాథపురం గ్రామానికి చెందిన సాయిని జనార్ధనరావు కూడా సౌదీ అరేబియాలో పని చేస్తూ ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. కుటుంబీకులు అతడిని స్వదేశానికి పంపించాలని సంబంధిత యజమానులను సంప్రదించినా పట్టించుకోలేదు. మందస మండలంలో హరిబంద గ్రామానికి చెందిన నక్కా శేషగిరి సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడు. యజమాని అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, తిరిగి ఇంటికి వచ్చేస్తానని కుటుంబీకుల వద్ద శేషగిరి మొర పెట్టుకున్నాడు. దీంతో కుటుంబీకులు ఈ విషయాన్నిశ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. సౌదీలో పనిచేస్తున్న తమ వారిని తిరిగి రప్పించేలా చూడాలని కోరుతున్నారు.


సౌదీ నుంచి సిక్కోలు వాసులను రప్పించాలని.. 


విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న శ్రీకాకుళం జిల్లా వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ విపుల్ దృష్టికి తీసుకు వెళ్లారు. విపుల్‌ను కలిసి సిక్కోలు జిల్లా వాసులు పడుతున్న కష్టాలను వివరించారు. సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తూ గల్లంతైన వజ్రపుకొత్తూరు మండలం కొల్లిపాడు గ్రామానికి చెందిన పుచ్చా కూర్మారావు ఆచూకీ గురించి విచారించి క్షేమంగా భారత దేశానికి తీసుకురావాలని కోరారు. 


పని చేస్తూ గాయపడ్డ సాయిని జనార్ధనరావుకు నష్ట పరిహారం ఇప్పించడంతోపాటు తిరిగి క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చేలా చూడాలన్నారు.  మందస మండలంలో హరిబంద గ్రామానికి చెందిన నక్కా శేషగిరిని కూడా యజమాని టార్చర్‌ నుంచి కాపాడి ఇండియాకు తీసుకురావాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు అభ్యర్థించారు.