Srikakulam News : శ్రీకాకుళం నీటికోసం ప్రజలు పాట్లు పడుతున్నారు. జిల్లాలో చెప్పుకోవడానికి నాలుగు నదులు ఉన్నా ప్రజల దాహం తీరేందుకు అవస్థలు తప్పడంలేదు. ఈ చిత్రమే ఇందుకు నిదర్శనం. జిల్లాలో సీనియర్ మంత్రులు ఉన్నా, అందరూ వెళ్లే రహదారి ఇదే అయినా తమ నీళ్ల బాధలు ఎవరికి పట్టడంలేదని స్థానికులు వాపోతున్నారు. గుక్కెడు మంచినీళ్లు కోసం గంటల తరబడి పాట్లు పడాల్సి వస్తుందంటున్నారు. 


తాగునీటి కోసం అవస్థలు 


ఒకపక్క మురికి కాలువ మరోపక్క తాగునీరు పట్టుకునేందుకు పైపుతో ఓ యువకుడు అవస్థపడుతున్న దృశ్యం ఏబీపీ కంటపడింది. శ్రీకాకుళం బలగారోడ్డులో ఈ దృశ్యం కనిపించింది. తాగునీటి కోసం అధికారులు ఎప్పటికప్పుడు రివ్యూలు, మంత్రులు సమావేశాలు మాటలకే పరిమితం అవుతున్నాయి. కూతవేటు దూరంలో నాగావళి నది ఉన్నా తాగునీటి మాత్రం నరకయాతన అనుభవిస్తున్నారు. మురుగునీటి పక్కనే ఉన్న పైపుల్లోని నీరు తాగడం వల్ల అనారోగ్యాలకు పాలవుతున్నామని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కనీసం పట్టించుకోవడం లేదని బాధితులు అంటున్నారు. ఇంటి పన్ను, చెత్తపై పన్ను వేయడానికి అధికారులు మాత్రం సమయానికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు కానీ తాగునీరు కోసం కనీసం మా వైపు కూడా చూడటం లేదన్నారు. ఇక్కడ వీధి కుళాయి పై సుమారుగా 80 మంది ఆధారపడుతున్నామని స్థానికులు అంటున్నారు. చివరికి నీరుని అలా పైపుల ద్వారా పట్టుకునే పరిస్థితి వస్తుందని, ఆ పైపు లోని కూడా కొంత కలుషితమైన నీరు రావడంతో అనారోగ్యాలకు గురవుతున్నామని ఆందోళన చెందుతున్నారు.  గత తొమ్మిది నెలలుగా ఇదే సమస్యపై ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేదని స్థానికులు అంటున్నారు. ఇదే రహదారిలో అధికారులు రోజూ వెళ్తుంటారు కానీ పట్టించుకున్న దాఖలాలులేవని అంటున్నారు. సచివాలయంలో ఎన్నిసార్లు చెప్పినా ఇదిగో అయిపోతుంది అదిగో వచ్చేస్తున్నాను అని చెప్పడమే తప్ప ఫలితం లేదంటున్నారు.