జనసేన అధినేత పవన్ కల్యాణ్ అస్త్ర సన్యాసం చేశారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ప్యాకేజీ కోసం పార్టీని అమ్మేశారని మండిపడ్డారు.


పవన్ వేషాలు చాలా కాస్ట్లీ గురూ!


పవన్‌ కల్యాణ్..  శ్రీకాకుళం జిల్లాకు వచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలరని మంత్రి అప్పల రాజు అన్నారు. పండగ పూట పగటివేషాలు వేసేవాళ్లు ముందస్తుగా వేసే డ్రామాల్లో పవన్ సభ భాగమని విమర్శించారు. పొట్టకూటి కోసం వేసే వేషాలని అన్నారు. పవన్‌ది వ్యవహారం కాదని, అదొక యవ్వారమని ఘాటుగా విమర్శించారు. వందల వేల కోట్లు తీసుకుని, పగటి వేషం వేసినట్లుందని, ఉత్తరాంధ్ర వెనుకబాటు గురించి మాట్లాడటంలో పవన్ అజ్ణానం బయడపడిందన్నారు.


ఉత్తరాంధ్రపై బాబుకు ఉన్న విద్వేషానికి అనుగుణంగానే 


ఉత్తరాంధ్రపై చంద్రబాబుకు ఉన్న విద్వేషం,  విశాఖను పాలనా రాజధానిని చేయకూడదన్న బాబు ఆలోచనకు అనుగుణంగానే పవన్ మాట్లాడారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. పవన్ సభకు పెట్టిన యువశక్తి పేరు కూడా టీడీపీ నుంచి వచ్చిందేనని చెప్పారు. లోకేశ్‌  పాదయాత్రకు యువగళం అని..పవన్ సభకు యువశక్తి అని టీడీపీ రాసిచ్చిన మేరకే పేర్లు పెట్టారని వ్యాఖ్యానించారు. విశాఖలో కూర్చుని ఉత్తరాంధ్రపై విషం చిమ్ముతున్నారని, ఇదే నాదెండ్ల మనోహర్, చంద్రబాబు పార్టీ ఆఫ్‌ ఇండియా (సీపీఐ) రామకృష్ణ ఉత్తరాంధ్ర పై విషం చిమ్మడానికి తోడయ్యారని పవన్ పై మంత్రి ఫైర్ అయ్యారు. అంతా ఒకే తానులో ముక్కలని, బాబు ఇచ్చే ప్యాకేజీ డబ్బు కోసం ఆశపడి మాట్లాడుతున్నారని అన్నారు.


అప్పుడు 2 హార్బర్లు... జగన్‌  హయాంలో 9


మత్స్యకారుల బతుకుల్లో జగన్‌ వల్లే వెలుగులు వచ్చాయని, మత్స్యకారుల వలసలు గురించి పవన్ కల్యాణ్ కు అసలు అవగాహన ఉందా అని మంత్రి నిలదీశారు. మత్స్యకారులకు జగన్‌  ప్రభుత్వం ఏం చేసిందో పవన్ కు తెలీదన్నారు.  స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాష్ట్రానికి వచ్చిన ఫిషింగ్‌ హార్బర్లు రెండే రెండు అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో రాబోతున్నవి 9 హర్బర్లని వివరించారు. 987 కి.మీ. ల తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రభుత్వాలూ మత్స్యకారుల సంక్షేమానికి ఆలోచించని సమయంలో పాదయాత్రలో  జగన్‌  కి మత్స్యకారులు చేసిన విన్నపం మేరకు, మా ప్రభుత్వ హయాంలో నే 9 హార్బర్లు మంజూరు చేశారన్నారు. ఇంతకన్నా మనసున్న నాయకుడు, గొప్పనాయకుడు మత్స్యకారులకు దొరుకుతాడా అని మంత్రి ప్రశ్నించారు.


 ఫిషింగ్ హార్బర్లు పరిశీలిద్దాం ఆ దమ్ముందా పవన్?


నెల్లూరు జిల్లాలో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ వద్ద హార్బర్ల నిర్మాణాన్ని  మాతో వచ్చి వాటి నిర్మాణాన్ని చూసే దమ్ము నీకుందా అని పవన్ ను ప్రశ్నించారు. రణస్థలం సమీపంలో రూ. 365 కోట్లతో హార్బర్‌ నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేయబోతున్నామని, మా ప్రభుత్వం తరఫున పవన్ కు ఆహ్వానాన్ని పంపిస్తామన్నారు. ఈ హార్బర్‌ నిర్మాణం గురించి మేం చాలా గర్వంగా చెప్పుకోగలమని, విజయనగరం జిల్లా చింతలవలస వద్ద మత్స్యకారుల కోసం ఒక ఫ్లోటింగ్‌ జెట్టీని ఇచ్చామన్నారు. విశాఖలో రూ. 150 కోట్లతో హార్బర్‌ను ఆధునికీకరిస్తున్నామని, పూడిమడక వద్ద మరో హార్బర్‌ను ఇచ్చామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా బియ్యపుతిప్ప వద్ద  ఒక హార్బర్‌కు శంకుస్థాపన చేశామని,  ప్రకాశం జిల్లా వాడరేవు వద్ద రెండు హార్బర్లు ఇచ్చామన్నారు.