ప్రజలను సోమరిపోతులను చేయెుద్దంటూ ఓ వాలంటీర్ లేఖ రాశారు. పింఛను నిబంధనలను మార్చేశారని, ఈ-కేవైసీ అవ్వకపోవడం వల్ల తీసుకోలేకపోయారని వాలంటీర్ ఆవేదన చెందారు. ఆ బకాయి పింఛన్ ను ఈ నెల ఇవ్వవద్దన్నారని లేఖలో తెలిపారు.  పదెకరాల భూములు ఉన్నవారికి పింఛను అందుతుందని, కానీ ఎంతోమంది నిరుపేదలు పింఛన్లు అందడంలేదన్నారు. అనేక పథకాలు తీసుకువచ్చి ప్రజలకు నేరుగా డబ్బులిస్తున్నారని, ప్రజలను సోమరిపోతులను చేయొద్దని లేఖలో తెలిపిపారు. అది మంచిది కాదన్నారు. సమస్యల మీద దృష్టిసారించి, యువతకు మంచి ఉద్యోగాలు కల్పించే దిశగా ఆలోచించాలని కోరారు. నిత్యావసర సరకుల ధరలు తగ్గించాలని శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌ పేట మండలం రావిచెంద్రి గ్రామ సచివాలయానికి చెందిన గ్రామ వాలంటీర్ చిట్టివలస కృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తూ రాసిన లేఖ  సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. 


ప్రజాసమస్యలపై దృష్టిపెట్టండి


సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి పథకాలపై కాక ప్రజాసమస్యలపై దృష్టిపెట్టాలని ఆయన లేఖలో కోరారు. వేల రూపాయలు జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారన్నారు. వాలంటీర్లకు రూ.5 వేల జీతం ఇస్తున్నారని ఇవి పెట్రోలుకూ సరిపోవట్లేదన్నారు. ఉద్యోగభద్రత లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు. 


Also Read: Central Varsities Jobs:సెంట్రల్ యూనివర్సిటీల్లో 6,229 జాబ్స్.. 10 లోగా నోటిఫికేషన్.. కేంద్ర మంత్రి వెల్లడి


వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా


చిత్తూరు జిల్లాలో  74 మంది వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా కలకలం రేపింది. సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు శుక్రవారం నిరసన చేశారు. గ్రామపంచాయతీకి ఈవోగా ఉన్న అధికారిపై చర్యలు తీసుకునే వరకు విధులకు హాజరు కామని స్పష్టం చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాలలో ఈవో కుసుమకుమారి, స్థానిక అధికార పార్టీ నాయకులు తమను తీవ్రంగా వేధిస్తున్నారని పాకాల మండలంలోని వాలంటీర్లు ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈవోను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం 74 మంది వాలంటీర్లు రాజీనామా చేస్తున్నామని తెలిపారు. ఈవో తమను అసభ్య పదజాలంతో దూషించారని, మానసికంగా వేధించారని ఆరోపించారు. ఆమెపై ఉన్నతాధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లపై స్థానిక నేతలు పెత్తనాలు మానుకోవాలని ఫిర్యాదు చేయడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.


 


Also Read: DGP Vs Chintamaneni : అన్నీ తప్పుడు కేసులే ..కోర్టుల్లో నిరూపించగలరా ? డీజీపీ సవాంగ్‌కు చింతమనేని ప్రశ్న..!