Dharmavaram News : శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై కేసు నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ ను గురువారం కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దాడికి ముందు రోజు జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి దాడులు చేస్తామని చెప్పి మరుసటిరోజే తన అనుచరులను పంపించి దాడి చేయించారని ఆరోపించారు.ఈ దాడులు చూస్తుంటే పాలేగాళ్ల రాజ్యంలో ఉన్నామా అన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. కేతిరెడ్డికి ఏదైనా సమస్య ఉంటే తనతో చూసుకోవాలి కానీ రెచ్చగొట్టి దాడులు చేయించడం అమాయకులను ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రజలకు సేవ చేస్తే సంతోషిస్తామని, ప్రజలు కూడా హర్షిస్తారన్నారు. అంతేకానీ దౌర్జన్యాలు భూకబ్జాలు చేస్తే తిరుగుబాటు తప్పదన్న విషయం గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే కేతిరెడ్డిని గోనుగుంట్ల హెచ్చరించారు. తాడి ఘటనకు సంబంధించి నేషనల్ హ్యూమన్ రైట్స్, నేషనల్ ఎస్సీ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశామని తొందర్లోనే వాళ్లు కూడా ఇక్కడికి వస్తారని చెప్పారు. 


ఫ్యాక్షనిజం, రౌడీయిజం చేస్తున్నారు-గోనుగుంట్ల 


ప్రెస్ కబ్ల్ లో బీజేపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టేందుకు వెళ్తే స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరులు ఆయన ఇంటి నుంచి మూడు వాహనాల్లో బయలుదేరి ప్రెస్ క్లబ్ లో బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడి చేశారు. అంతకు ముందు రోజే ప్లీనరీలో అందరినీ కొడతామని కేతిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. డైరెక్ట్ గా చెప్పి కొట్టే పరిస్థితుల్లో పాలన ఉంది. రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుస్తోంది. ఇందుకు ముఖ్యంగా కారణం స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి. ఆయనపై కేసులు పెట్టాలి. అందుకోసమే ఎస్పీని కలిశాం. ఫిర్యాదు చేశాం. ఈ ఘటనపై మేము కోర్టుకు కూడా వెళ్తాం. కచ్చితంగా నిజానిజాలు బయటకు వస్తాయి. ఎవరైతే స్థానిక పోలీసుల వాళ్లకు వత్తాసు పలుకుతున్నారో వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్హెచ్ఆర్సీకి కూడా ఫిర్యాదు చేశాం. వైసీపీ అభివృద్ధి మానేసి ఫ్యాక్షనిజం, రౌడీయిజం, కబ్జాయిజం చేస్తుంది. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయకుండా దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ్టికైనా ప్రజలకు మంచి చేస్తే ఆదరిస్తారు. లేదు రౌడీయిజం చేస్తామంటే తగిన శాస్తిచేస్తారు. అనవసరంగా అమాయకులను రెచ్చగొట్టద్దు, వారిపై దాడులు చేయించొద్దు- బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ