Somu Veerraju : ఏపీ రాజకీయాల్లో అనూహ్యంగా మారుతున్న పరిణామాలు, పొత్తులపై విస్తృత చర్చ జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ డిల్లీ వెళ్లి బీజేపీ హైకమాండ్‌ను కలిశారు. బీజేపీ , జనసేన .. వైఎస్ఆర్‌సీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తున్నాయని ప్రకటించారు. ఈ అంశంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. జనసేన, బీజేపీ కలిసే ఉన్నాయని.. కలిసే ముందుకు వెళతామన్నారు. ఈ ప్రభుత్వం పై ఇద్దరం కలిసే పోరాడతామన్నారు. కలిసి ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భవిష్యత్తులో కూడా జనసేన, బీజేపీ కలిసే ప్రయాణం చేస్తుందని సోము వీర్రాజు పేర్కొన్నారు.
రాజకీయ అవసరాల కోసం సహజంగా అనేక పార్టీ నేతలను కలుస్తామని.. గతంలో చంద్రబాబును కూడా రాష్ట్రపతికి మద్దతు ఇచ్చిన సమయంలో కలిశామని.. అలా కలిసిన వారందరితో పొత్తు ఉన్నట్లు కాదని సోము వీర్రాజు తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ తమ పార్టీ పెద్దలను కలిసి మాట్లాడారంటే తమ బంధం ఎంత బలమైనదో తెలుసుకోవాలని సోము వీర్రాజు పేర్కొన్నారు. తామిద్దరం కలిసి వైసీపీ ప్రభుత్వం మీద ఉద్యమిస్తామని వెల్లడించారు. ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానాలు అక్కర్లేదన్నారు. రాజకీయాల్లో కొన్ని రచనలు జరుగుతాయన్నారు. నాయకులు ఏది మాట్లాడినా ఒక వ్యూహంతో మాట్లాడతారన్నారు. మా సత్యకుమార్, ఇతర నేతలపై దాడి అందరూ చూశారన్నారు. తమ పార్టీ అధిష్టానం కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉందని సోము వీర్రాజు వెల్లడించారు.
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం తర్వాత పవన్ కల్యాణ్ .. అధికారం సాధించే దిశగానే చర్చలు జరిపామని ప్రకటించారు. బీజేపీ, జనసేన లక్ష్యం వైసీపీని ఓడించడమన్నారు. రెండు రోజుల పాటు జరిగిన చర్చల వల్ల రాబోయే రోజుల్లో మంచి ఫలిాలు వస్తాయన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ జనసేన ఎజెండా అని అని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో అన్ని విషయాలు చెబుతానని పవన్ చెప్పారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనేదే మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. మురళీధరన్ తో రెండుసార్లు సమావేశమైన పవన్ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఏపీలో బీజేపీ-జనసేన మధ్య అధికారికంగా పొత్తున్నప్పటికీ ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించడంలేదు. తెలుగుదేశం పార్టీకి చేరువవుతున్న జనసేనాని బీజేపీ కూడా పొత్తుకు కలిసిరావాలని కోరుతున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఈ విషయంలో ఆలోచన ఏమిటన్నదానిపై క్లారిటీ లేదు.
ఇప్పటికీ బీజేపీ, జనసేన పొత్తులోనే ఉన్నాయి. కానీ ఏపీలో మాత్రం కలిసి పని చేయడం లేదు. రాష్ట్ర నాయకులతో తనకు గ్యాప్ ఉందని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. వారు వైసీపీపై పోరాటం చేయడం లేదని పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే బీజేపీ నేతలు కూడా అడిగినప్పుడు కూడా జనసేన మద్దతు ప్రకటించలేదని.. పొత్తు ఉన్నా లేనట్లేనని ప్రకటించేశారు. ఈ పొత్తుల సస్పెన్స్ అలా కొనసాగుతూనే ఉంది.