YSRCP: వైసీపీకి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కలిశారు. టీడీపీలో చేరాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. పార్టీ అధిష్టానం సూచన మేరకు వేమిరెడ్డిని సోమిరెడ్డి కలిసి టీడీపీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు టీటీడీ బోర్డు మెంబర్‌గా ఉన్న ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వైసీపీకి రాజీనామా సమర్పించారు. ఈ మేరకు ఇద్దరూ రాజీనామా లేఖను వైసీపీ అధిష్టానానికి పంపించారు. వ్యక్తిగత కారణాల వల్ల పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.


అలాగే రాజ్యసభ పదవికి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ  క్రమంలో సాయంత్రం ఆయనతో భేటీ అయిన సోమిరెడ్డి..టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ.. వేమిరెడ్డి దంపతులు వైసీపీకి రాజీనామా చేయడం మంచి పరిణామమని, వేమిరెడ్డి కుట్రలు, కుతంత్రాలు చేసే నేత కాదని అన్నారు. వైసీపీలో ఇమడలేకే వేమిరెడ్డి బయటకు వచ్చారని సోమిరెడ్డి తెలిపారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి టీడీపీలో చేరాల్సిందిగా ఆహ్వానించినట్లు స్పష్టం చేశారు. అయితే వేమిరెడ్డి దాదాపు టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయనతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు వైసీపీ కీలక నేతలు సైకిలెక్కే అవకాశముంది. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు  ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ గూటికి చేరారు. ఇప్పుడు ఎన్నికల క్రమంలో మరికొంతమంది పసుపు కండువా కప్పుకునేందుకు సిద్దమవుతున్నారు.


అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేయడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఆయనకు సీఎం జగన్ టికెట్ ఖరారు చేశారు. కానీ తన పార్లమెంట్ పరిధిలో పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చాలని జగన్‌ను వేమిరెడ్డి కోరారు. నెల్లూరు సిటీ నుంచి తన భార్య ప్రశాంతి రెడ్డికి టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదన పెట్టారు. కానీ జగన్ నుంచి హామీ రాకపోవడంతో గత కొద్దికాలంగా వైసీపీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. వైసీపీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా పాల్గొనడం లేదు. గత కొద్దిరోజులుగా ఢిల్లీలోనే ఉంటున్న ఆయన.. ఇటీవల హైదరాబాద్‌లో చంద్రబాబుతో భేటీ అయినట్లు తెలుస్తోంది. టీడీపీలో చేరే విషయంపై చంద్రబాబుతో చర్చించారు. టీడీపీ అధినేత నుంచి కీలక హామీ లభించడంతో వేమిరెడ్డి వైసీపీకి రాజీనామా చేసినట్లు సమాచారం. 


వచ్చే ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎంపీ టికెట్‌తో పాటు ఆయన సతీమణికి ఎమ్మెల్యే సీటు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ హామీతోనే టీడీపీలో చేరేందుకు సిద్దమైనట్లు సమాచారం. ఇక నెల్లూరు వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా టీడీపీలో చేరే యోచనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.