TDP Manifesto : రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో గెలవాలంటే మేనిఫెస్టో ఎంతో కీలకం. ఆ మేనిఫెస్టోపై టీడీపీ పూర్తి స్థాయిలో కసరత్తుచేస్తోంది. మహానాడులో వచ్చే ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రధానాంశాలు చంద్రబాబు ప్రకటన చేయనున్నారు. అలాగే  విజయ దశమికి సమగ్రమైన, రాష్ట్ర భవిష్యత్తును మార్చే దిశగా మ్యానిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ వివరాలను ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు.   2024లో జ‌రిగే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. కనీవినీ ఎరుగని రీతిలో రాజమండ్రిలో మహానాడును నిర్వహిస్తామన్నారు.  


26వ తేదీన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు రాజమండ్రి చేరుకుంటారని.. 26 సాయంత్రం పొలిట్ బ్యూరో సమావేశం చంద్రబాబు అధ్యక్షతన జరగనుందని వివరించారు. ఆ సమావేశంలో మహానాడులో ప్రవేశపెట్టే 15 తీర్మానాలు చర్చించి ఆమోదిస్తామన్నారు. 27న 15 వేలమంది ప్రతినిధుల సభలో చంద్రబాబు పాల్గొంటారని తెలిపారు. 28న మహానాడుకు శరవేగంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని.. మహానాడు నుంచే ఎన్నికల శంఖారావం ఆరంభమవుతుందన్నారు. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.                                                            


తెలుగుదేశం పార్టీ ఈ నెల 27, 28వ తేదీల్లో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించనున్న మహానాడు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కలెక్టరేట్‌కు కొద్దిదూరంలో వేమగిరి, ధవళేశ్వరం జాతీయ రహదారి పక్కన ఈ సభ ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 50 ఎకరాల్లో 28వ తేదీన జరిగే బహిరంగ సభకు స్థలాన్ని ఇప్పటికే చదును చేసి సిద్ధంచేశారు. దానిని ఆనుకుని ఉన్న హైవేకు రెండో వైపున మరో 50 ఎకరాల స్థలంలో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 15 ఎకరాల్లో 27న జరిగే ప్రతినిధుల సభ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఇప్పటికే వేదిక సిద్ధం చేశారు. ప్రతినిధుల సభ ప్రాంగణంతో పాటు, పక్కనే మరో వేదిక సిద్ధం చేస్తున్నారు. దానిని మహానాడుకు ఆఫీసుగా నిర్వహించనున్నారు.                                        


మొదటి రోజు ప్రతినిధుల సభ వద్ద 50 వేల మందికి ఉదయం, సాయంత్రం భోజన ఏర్పాట్లు చేస్తున్నామని, 28వ తేదీన కూడా ఇక్కడే భోజనాలు ఉంటాయని  టీడీపీ నేతలు ప్రకటించారు.  28వతేదీ సాయంత్రం 5గంటలకు బహిరంగ సభ ఆరంభమవుతుందని, సభ తర్వాత అందరూ భోజనం చేసి వెళ్లే విధంగా పలు ప్రాంతాల్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.  రావులపాలెం వైపు నుంచి వచ్చేవారికి వేమగిరి సమీపంలో, విశాఖపట్నం నుంచి, ఫోర్త్‌ బ్రిడ్జి నుంచి వచ్చే వారికి అటువైపున, మధ్యలో మరో మూడు చోట్ల భోజన సదుపాయం ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొదటి రోజు వెజ్‌, రెండో రోజే నాన్‌వెజ్‌ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు.