SIT officers search Chevireddy house: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దూకుడు పెంచింది. మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్‌సిపి నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంతో పాటు చిత్తూరు వైసీపీ ఇంచార్జ్ విజయానంద్ రెడ్డి ఇంట్లో సిట్ సోదాలు నిర్వహించింది. తిరుపతి సమీపంలోని తుమ్మలగుంటలో 20 మంది సిబ్బందితో ఈ తనిఖీలు జరిగాయి. ఈ కేసులో ఇప్పటికే చెవిరెడ్డిని అరెస్ట్ చేసిన సిట్, తాజా సోదాలతో మరింత ఆధారాలు సేకరించే ప్రయత్నంలో ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో సిట్ బృందం బుధవారం తెల్లవారుజామున సోదాలు ప్రారంభించింది. 20 మంది సిబ్బందితో కూడిన ఈ బృందం, తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసంలో డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ డివైస్‌లు, ఇతర కీలక ఆధారాల కోసం తనిఖీలు నిర్వహించింది. ఈ కేసులో చెవిరెడ్డి A-38 గా ఉన్నాg. గతంలో బెంగళూరు విమానాశ్రయంలో శ్రీలంకకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అతన్ని సిట్ అరెస్ట్ చేసింది. అతనితో పాటు వెంకటేష్ నాయుడ్ని కూడా అరెస్టు చేశారు. తాము బిజినెస్ కోసం వెళ్తూంటే అరెస్టు చేశారని చెవిరెడ్డి అంటున్నారు.
సిట్ వర్గాల సమాచారం ప్రకారం, మద్యం కుంభకోణంలో సుమారు 250-300 కోట్ల రూపాయల నగదు ఎన్నికల ఖర్చుల కోసం రాజ్ కాసిరెడ్డి ద్వారా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా చెలామణి చేశారు. 2024 ఎన్నికల సమయంలో జగ్గయ్యపేట మండలంలోని గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద 8 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్న ఘటన ఈ కేసులో కీలక ఆధారంగా మారింది. సిట్ ఇప్పుడు ఈ సోదాల ద్వారా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మరిన్ని ఆధారాలను సేకరించే పనిలో ఉంది.
అదే సమయంలో, చిత్తూరు వైసీపీ ఇంచార్జ్ విజయానంద్ రెడ్డి నివాసంలోనూ సిట్ సోదాలు చేపట్టింది. ఈ కేసులో విజయానంద్ రెడ్డి పాత్రపై సిట్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అతని ఇంట్లో డాక్యుమెంట్లు, ఫైనాన్షియల్ రికార్డులు, ఎలక్ట్రానిక్ డివైస్‌లను సిట్ బృందం పరిశీలిస్తోంది. విజయానందరెడ్డి గత ఎన్నికల్లో చిత్తూరు నుంచి పోటీ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆరణి శ్రీనివాసులుకు టిక్కెట్ నిరాకిరంచి ఆయనకు చాన్స్ ఇచ్చారు. ఆయనపై ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు ఉండటంతో అప్పట్లో సంచలనం సృష్టించింది.
ఈ సోదాలు మద్యం కుంభకోణంలో విజయానంద్ రెడ్డి సంబంధాలను బయటపెట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సిట్ ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరుపుతోంది. చెవిరెడ్డి, విజయానంద్ రెడ్డిల నివాసాల్లో సేకరించిన ఆధారాలను విశ్లేషించి, వారి ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తోంది. ఈ సోదాలు కేసులో కీలక మలుపు తీసుకురావచ్చని, ఇతర రాజకీయ నాయకులు, అధికారుల పాత్ర కూడా బయటపడవచ్చని సిట్ వర్గాలు తెలిపాయి. త్వరలో మరో అనుబంధ చార్జిషీట్‌ను సిట్ దాఖలు చేసే అవకాశం ఉంది.