SIT files another chargesheet in AP liquor scam: ఏపీ మద్యం కుంభకోణ కేసులో సిట్ 86 పేజీల మూడో అదనపు చార్జ్‌షీట్ దాఖలు చేసింది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ లు లిక్కర్ స్కామ్‌లో కీలకంగా ఎలా వ్యవహరించారో ఇందులో వివరించినట్లుగా తెలుస్ోతంది. ముఖ్యంగా మద్యం ముడుపుల రవాణా, పంపిణీ , సంబంధిత అక్రమ కార్యకలాపాల గురించి వివరాలను ఈ చార్జిషీట్‌లో పొందు పరిచారు. ఇది కేసు దర్యాప్తులో మరో ముందడుగుగా భావిస్తున్నారు.
జూలై 19, 2025న 300 పేజీల ప్రాథమిక చార్జ్‌షీట్‌ను సిట్ దాఖలు చేసింది. ఆగస్టు 11, 2025న 200 పేజీల రెండో చార్జ్‌షీట్, ఇప్పుడు 86 పేజీల మూడో అదనపు చార్జ్‌షీట్ కోర్టులో నమోదు చేసింది. ఈ చార్జ్‌షీట్‌లో మద్యం ముడుపుల రవాణాలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని, అతని సహాయంతో వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ ముడుపులను అక్రమంగా తీసుకొచ్చి పంపిణీ చేశారని పేర్కొంది. ఎన్నికల సమయంలో తెలంగాణ నుంచి ఏపీ సరిహద్దులకు రూ.8.20 కోట్ల నగదును బాలాజీ తీసుకొచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మద్యం సిండికేట్‌లో ముడుపుల సేకరణ, దాచిపెట్టడం, బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడంలో పాలుపంచుకున్నారని, అతని పీఏలు నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ ఈ ప్రక్రియలో సహకరించారని సిట్ వెల్లడించింది. వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి మిత్రుడిగా ఈ కార్యకలాపాల్లో ముఖ్య పాత్ర పోషించారని సిట్ తేల్చింది.
ఈ నలుగురిలో పరారీలో ఉన్న ఇద్దర్ని ఇండోర్‌లో సిట్ అధికారులు అరెస్టు చేశారు. చెవిరెడ్డి , వెంకటేష్ నాయుడ్ని శ్రీలంకకు వెళ్తూండగా బెంగళూరులో అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం కేసులో 19 సంస్థలు, 29 మంది వ్యక్తులు నిందితులుగా ఉన్నారు. ఇప్పటికి ఈ కేసులో సిట్ దర్యాప్తులో 268 మంది సాక్షులను విచారించగా, రూ.62 కోట్లు సీజ్ చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు, ఎలక్ట్రానిక్ పరికరాల డేటా, కాల్ రికార్డులు, గూగుల్ టేక్‌అవుట్ సమాచారం వంటి ఆధారాలు చార్జ్‌షీట్‌లో సాక్ష్యాలుగా ప్రవేశ పెట్టారు.
గత రెండు వారాలుగా సిట్ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెందిన కంపెనీల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. అలాగే జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న సునీల్ రెడ్డి కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించారు. చెవిరెడ్డి..కంపెనీల్లో లభించిన ఆధారాలను సమర్పించారు. లిక్కర్ కేసు రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణానికి సంబంధించినదని సిట్ చెబుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు గతంలో చార్జిషీట్‌లో పేర్కొన్నారు. మరో వైపు తనను అరెస్టు చేసి 90 రోజులు దాటిందని.. డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.