Singareni No BID :    రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్‌కు  మూలధనం సమకూర్చేందుకు  జారీ చేసిన ఆసక్తి వ్యక్తీకరణ బిడ్‌లో పాల్గొనేందుకు సింగరేణి సంస్థ ఆసక్తి చూపించలేదు. ఐదు రోజుల కిందట.. పదిహేనో తేదీన బిడ్ల దాఖలకు ఆఖరు రోజున.. కాస్త సమయం కావాలని స్టీల్ ప్లాంట్ అధికారులను సింగరేణి యాజమాన్యం ప్రత్యేకంగా కోరింది. దీంతో మరో ఐదు రోజులు గడువు పొడిగిస్తూ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఐదు రోజుల్లోనూ సింగరేణి యాజమాన్యం  బిడ్ దాఖలుకు నిర్ణయం తీసుకోలేదు. వర్కవుట్ కాదన్న అభిప్రాయంతోనే మిన్నకుండిపోయినట్లుగా భావిస్తున్నారు. 


గడుపు పొడిగించినా స్టీల్ ప్లాంట్ బిడ్ దాఖలు చేయని సింగరేణి                                    


సింగరేణి యాజమాన్యం విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిశీలించి..  ఉన్నతాధికారులతో సమావేశం అయింది. వివరాలు తీసుకుని తర్వాత అన్ని వివరాలతో సమగ్రంగా నివేదిక రూపొందించి తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం అనుమతి ఇస్తే బిడ్ వేయడానికి సింగరేణి ఏర్పాట్లు రెడీ చేసుకుంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లుగా చెబుతున్నారు. అందుకే  బిడ్ దాఖలు చేయడానికి అనుమతించలేదని తెలుస్తోంది. ఒక వేళ సింగరేణికి బిడ్ లభిస్తే.. అందు కోసం కనీసం రూ. ఐదు వేల కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. సింగరేణికి అది పెద్ద భారం అవుతుందన్న అభిప్రాయం ఉంది. 


ఒక వేళ బిడ్ వస్తే రూ. ఐదు వేల కోట్ల వరకూ కేటాయించాల్సి రావొచ్చు                             


అదే సమయంలో తెలంగాణలో తెరిపిస్తామని హామీ ఇచ్చిన అనేక పరిశ్రమలను తెలంగాణ సర్కార్ తెరిపించలేకపోయింది. వాటిని తెరిపించకుండా వేలకోట్లను ఏపీలో ఉన్న పరిశ్రమ కోసం తరలిస్తే.. తెలంగాణలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు  భావించినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే ఈ అంశంపై విపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. సింగరేణికి మూలధనం ఇచ్చేంత ధనం ఉంటే.. ముందుగా నిజాం షుగర్స్‌ ను తెరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి రాజకీయంగా చిక్కులు వచ్చే పరిస్థితి తలెత్తింది.  


అన్నీ ఆలోచించి వెనక్కి తగ్గిన తెలంగాణ ప్రభుత్వం                                   


అన్ని ఆలోచించిన తర్వాత  బిడ్ దాఖలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ కు మూలధనాన్ని సమీకరించేందుకు మొత్తం 22 సంస్థలు బిడ్ వేసినట్లుగా చెబుతున్నారు. ఇందులో ఆరు అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. ఉక్రెయిన్ కంపెనీ కూడా బిడ్ దాఖలు చేసింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ కూడా  బిడ్ దాఖలు చేశారు. ఆయన ఓ చిన్న కంపెనీని భాగస్వామ్యం చేసుకుని బిడ్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ బిడ్లలో నిబంధనలకు అనుకంగా ఉన్న వాటిని పరిశీలించి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మూలధనాన్ని ఎవరి వద్ద నుంచి తీసుకోవాలో ఖరారు చేసుకునే అవకాశం ఉంది.