అనంతపురం జిల్లా కల్యాణదుర్గ్‌ ఎమ్మెల్యే మంత్రి పదవి రేసులో ఉన్నారు. 24 గంటల్లో గుడ్‌ న్యూస్ వింటారని అనుచరులు సంబరాలు చేసుకునేందుకు రెడీగా ఉన్నారు. కానీ ఇంతలోనే సొంతపార్టీ నేత ఒకరు షాక్ ఇచ్చారు. 


కళ్యాణదుర్గం వైసీపీ ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ దంపతుల చుట్టూ వివాదాలు చుట్టుట్టాయి. ఎప్పుడో తీసుకున్న అప్పు ఇప్పుడు వారి మెడకు చుట్టుకుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పుగా తీసుకున్న కోటి 66 లక్షల డబ్బు ఇప్పుడు సమస్యగా మారింది. 


2019 ఎన్నికల కంటే ముందు తీసుకున్న సొమ్ము ఇవ్వమంటే ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని ఆరోపించారు కల్యాణదుర్గం కౌన్సిలర్ ప్రభావతి, వైసీపీ నాయకుడు శ్రీకాంత్ రెడ్డి. వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని బెదిరిపోతోందా జంట. ఎమ్మెల్యే నుంచి తమను రక్షించాలంటూ సీఎం జగన్‌ను వేడుకున్నారు కౌన్సిలర్ దంపతులు.


2019 ఎన్నికల కంటే ముందు తీసుకున్న సొమ్ములో ఏడాది క్రితం కోటి 10 లక్షలు ఇచ్చారన్నారు. మిగిలిన సొమ్ము ఇవ్వాలని ఒత్తిడి తీసుకొస్తే బెదిరిస్తున్నారని ఆరోపించారు. డబ్బుల విషయంపై ఎమ్మెల్యే ఇంటి ముందే ప్రెస్‌మీట్‌ పెట్టి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. 


ఈ సంఘటన జరిగిన కాసేపటికి కక్ష సాధింపులో భాగంగానే కౌన్సిలర్ తమ్ముడు రామిరెడ్డిపై మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఎదుట ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని ఆరోపించారు కౌన్సిలర్‌. జనన మరణ విభాగంలో పనిచేస్తున్న రామి రెడ్డి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వలేదని ఆరోపణతో దాడి చేశారన్నారు. సర్టిఫికేట్ల డబ్బులు వాడుకున్నారన్న నెపంతో దాడికి పాల్పడ్డారు ఎమ్మెల్యే వర్గీయులు, అనుచరులు.