Laddu Ghee Adulteration Issue : తిరుమల లడ్డూ కల్తీపై  గౌరవ సుప్రీంకోర్టు చేసిన సూచన  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు చెంపపెట్టు లాంటిదని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఆమె  స్పందించారు.  కేంద్రం దర్యాప్తు చేయాలని, CBI తో విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ముందునుంచే వాదిస్తోందని గుర్తు చేశారు.  ఇవ్వాళ సుప్రీం ఇచ్చిన సూచన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కి బలం చేకూరినట్లయ్యిందన్నారు.  సిట్ దర్యాప్తు రబ్బర్ స్టాంప్ తప్పా.. విచారణకు ఉపయోగం లేదన్నారు. 


సీబీఐకి అప్పగిస్తేనే లోతైన దర్యాప్తు జరిగే అవకాశం                 


CBI కి అప్పగిస్తేనే లడ్డూ కల్తీపై లోతైన దర్యాప్తు జరుగుతుందని..  ఆందోళనలో ఉన్న కోట్లాది మంది భక్తులకు నిజానిజాలు వెల్లడవుతాయని స్పష్టం చేశారు.  కల్తీ ఎలా జరిగింది ? ఎక్కడ జరిగింది ? పాల్పడ్డ దొంగలు ఎవరు ?  తక్కువ ధరకు కాంట్రాక్టు ఇవ్వడం వెనుక కారణం ఏంటి ? NDDB రిపోర్ట్ ను ఎందుకు ఇంతకాలం దాచిపెట్టారు ? మత రాజకీయాలకు ఆజ్యం పోసింది ఎవరు ?  ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానం దొరకాల్సిన అవసరం ఉందని షర్మిల స్పష్టం చేశారు. లడ్డూ కల్తీ  నిందితులకు కఠిన శిక్ష పడాల్సిన అవసరం ఉందని..  కూటమి సర్కారును మళ్ళీ డిమాండ్ చేస్తున్నామన్నారు.  దెబ్బతిన్న హిందువుల మనోభావాలు మీకు ముఖ్యం అనుకుంటే.. మత రాజకీయాలు మీ అజెండా కాకపోతే  లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. 


లడ్డూ కల్తీపై న్యాయమూర్తుల కీలక వ్యాఖ్యలు                                  


లడ్డూ నెయ్యి కల్తీ అంశంపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. కల్తీ నెయ్యిని వెనక్కి పంపారని.. లడ్డూలకు ఉపయోగించిన నెయ్యిలో కల్తీ అయిందో లేదో ఆధారాలు చూపించాలన్నారు. లడ్డూలను టెస్టు చేయించారా అని ప్రశ్నించారు. ఈ అంశంపై న్యాయమూర్తులు తీవ్రంగా ప్రశ్నించారు. విచారణకు సిట్ ను నియమించిన తర్వాత ముఖ్యమంత్రి ఎలా మీడియా ప్రకటన చేస్తారని ప్రశ్నించారు. ఈ అంశంలో సిట్ విచారణ చేయాలా.. లేకపోతే  కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలా అన్నది గురువారం విచారమలో నిర్ణయించే అవకాశం ఉంది.         


లడ్డూ కల్తీ జరిగిందనడానికి ఆధారాలేవి ? శ్రీవారి ప్రసాద వివాదంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు


వైసీపీ ,టీడీపీ మధ్య లడ్డూ మంటలు                  


సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత  లడ్డూ కల్తీ జరిగిందనడానికి ఆధారాల్లేవని తాము చెబుతున్నది నిజమేనన తేలిందని వైసీపీ నేతలంటున్నారు. సిట్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని.. కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే సీబీఐ విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ అంటోంది. సీబీఐ విచారణపై వైసీపీ ఇంకా తన అభిప్రాయానని వెల్లడించలేదు.