Sharmila demanded sitting judge inquiry in Rushikonda Palace Issue : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రుషికొండ అంశం సంచలనంగా మారింది. ప్రజాధనం వందల కోట్లు దుర్వినియోగం చేసి జగన్మోహన్ రెడ్డి తాను ఉండేందుకు క్యాంప్ ఆఫీసు కట్టించుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం రుషికొడంలో నిర్మాణాలపై ఎవరికీ ఎలాంటి సమాచారం లేదు. కనీసం లోపలి ఫోటోలు కూడా వెలుగులోకి రాలేదు. ప్రభుత్వం మారడంతో .. సీన్ మారిపోయింది. భీమిలి నియోజకవర్గం పరిధిలోకి రుషికొండ వస్తుంది. దీంతో అక్కడి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రుషికొండ భవనాన్ని పరిశీలించారు. ఆయన మీడియా ప్రతినిధుల్ని కూడా తీసుకెళ్లడంతో లోపలి వైభోగాలు సంచలనంగా మారాయి.
ఈ అంశంపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కూడా స్పందించారు. రిషికొండ విషయంలో ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని ఇలాంటి వాటిని అంగీకరించే ప్రసక్తే ఉండదన్నారు. మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. రుషికొండపై గతంలో పర్యాటక శాఖకు చెందిన కాటేజీలు ఉండేవి. వాటి నుంచి ఏడాదికి రూ. పాతిక కోట్ల వరకూ ఆదాయం వచ్చేది. అయితే ప్రభుత్వం హఠాత్తుగా వాటిని రూ. 90 కోట్లకుపైగా ఖర్చుతో కూల్చేసి స్టార్ హోటల్ కడుతున్నామని ప్రకటించింది. కానీ చేసిన నిర్మాణం స్టార్ హోటల్ కాదు. గెస్ట్ హౌస్ లా ఉంది.
ఎన్నికలకు ముందు ఈ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ఓ కమిటీ వేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారిమి శ్రీలక్ష్మి నేతృత్వంలో కమిటీ ఈ భవనాలను సీఎం జగన్ క్యాంప్ ఆఫీసుగా వినియోగించుకోవచ్చని సిఫారసు చేసింది. దీంతో ఎన్నికలు అయిపోగానే ఆయన విశాఖకు వచ్చి కాపురం పెట్టి.. పాలన చేయాలనుకున్నారు. అయితే పలితాలు తేడాగా రావడంతో మొత్తం రివర్స్ అయింది. ఇప్పుడు ప్యాలెస్ నిర్మాణం కోసం చేసిన ఖర్చు కూడా వైరల్ గా మారుతోంది.
రుషికొండ ఇంటికి సంబంధించి ప్రతి ఒక్క వస్తువును విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. టాయిలెట్ కమోడ్ ధర ముఫ్పై లక్షల రూపాయల వరకూ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అక్కడ పెట్టిన వస్తువుల ఫోటోలను ఆన్ లైన్ లో సెర్చ్ చేసి వాటి ధర ఎతో నెటిజన్లు సోషల్ మీడియాలో పెడుతున్నారు. దీంతో ఆశ్చర్యపోవడం ప్రజల వంతు అవుతోంది. అందుకే ఈ అంశంపై న్యాయ విచారణకు ఆదేశించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. షర్మిల కూడా అదే చెబుతున్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరుతున్నారు.