Andhra Disha police stations  : దిశా పోలీస్ స్టేషన్ల పేరు మారుస్తామమని మంత్రి అనిత ప్రకటించారు. హోమ్, విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా వంగలపూడి అనిత (Vangalapudi Anita) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.  పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని, పోలీసుల్లో పాత బ్లడ్ ఉంటే పక్కకు తప్పుకోవాలని ఆమె సూచించారు. పోలీసులు ప్రజలకు అనుకూలంగా పని చేయాలని, ఖాకీ డ్రెస్‌కు గౌరవం వచ్చేలా పనిచేయాలని ఆమె హితబోధ చేశారు. సోషల్ మీడియాలో మనోభావాలు దెబ్బ తీసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని  హెచ్చరించారు.

  


వంద రోజుల్లో గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్ కు అడ్డుకట్ట                              


 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ రవాణా చాలా వరకూ తగ్గిస్తామన్నారు. గత ప్రభుత్వంలో అక్రమ కేసులపై విచారణ జరిపిస్తామని, అక్రమాలకు బలైన వారు కేసు రీఓపెన్ చేయాలని కోరితే తప్పకుండా చేస్తామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో లా అండ్ ఆర్డర్‌లో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని, రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా శాంతిభద్రతల నిర్వహణ ఉంటుందన్నారు.  





 


దిశ చట్టానికి లభించని అనుమతి                        


 కేంద్రం అనుమతి పొందకుండానే ఆ చట్టాన్ని అమలు చేస్తున్నామని చెప్పిన నాటి జగన్ ప్రభుత్వం దానికోసం దిశ ప్రత్యేక పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేసింది. దిశా చట్టం కింద పలు కేసులలో చర్యలు కూడా తీసుకుంటున్నట్టు ప్రకటనలు చేసింది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఏపీలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెద్దఎత్తున కొనసాగాయని టీడీపీ ఆరోపిస్తూ వచ్చింది.  ఈ క్రమంలో ఆమె దిశ చట్టానికి చట్టబద్ధత లేదని  స్పష్టం చేశారు. అందుకే దిశా పోలీస్ స్టేషన్ల పేరు మార్చాలని నిర్ణయంచారు.  2014లో టీడీపీ హయాంలో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్లను కొనసాగిస్తామని పేర్కొన్నారు.                                     


సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు                                                   


సోష‌ల్ మీడియాలో మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా వ్య‌వ‌హ‌రిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని అనిత హెచ్చ‌రించారు. గతంలో స్వయంగా అనితపై ఎంతో మంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. వారి సంగతి తేలుస్తానని అనిత అప్పట్లో ఆరోపించారు. ఇప్పుడు ఆమె స్వయంగా  హోం మంత్రి కావడంతో ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్న ఆసక్తి ఏర్పడింది.