Sharmila criticized Pawan Kalyan on Konaseema Evil Eye Comments: కోనసీమ పచ్చగా ఉంటుందని.. తెలంగాణ నేతల దిష్టి తగిలిందని .. తల వాల్చేస్తున్న కొబ్బరి చెట్ల అంశంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం ఇంకా సాగుతోంది. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా స్పందిస్తున్నారు. కోనసీమ కొబ్బరికి తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడటం బాధాకరమని షర్మిల తాజాగా ప్రకటన చేశారు. ఇలాంటి మాటలు ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చ గొట్టడమేనని స్పష్టం చేశారు. ఇది పవన్ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్నదమ్ముల్లాంటి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలను నింపొద్దని సలహా ఇచ్చారు.
శంకరగుప్తం డ్రెయిన్ కు ఇరువైపులా గట్లు, డ్రెడ్జింగ్ నిర్మాణాలకు పట్టింపు లేకపోతే, సముద్రం నుంచి పైకొస్తున్న ఉప్పు నీళ్లతో లక్షల సంఖ్యలో చెట్లు కూలిపోతే, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టని ప్రభుత్వ వైఫల్యాన్ని దిష్టి మీద రుద్దడం సరికాదన్నారు. మూడ నమ్మకాలను అడ్డంపెట్టుకుని ప్రజలను కించపరచడం ఉప ముఖ్యమంత్రిగా మీకు సబబు కాదని కోనసీమ కొబ్బరిచెట్టుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఉప్పునీటి ముప్పును తప్పించాలన్నారు. కొబ్బరి రైతుల కష్టాలకు తక్షణ పరిష్కారం చూపండి. 3500 కోట్లు వెంటనే కేటాయించి పనులు మొదలు పెట్టాలని సలహా ఇచ్చారు.
పవన్ ఏమన్నారంటే ?
ఏపీ ప్రభుత్వం నిర్వహించిన 'పల్లె పండుగ 2.0' కార్యక్రమం ఈస్ట్ గోదావరి జిల్లా రాజోలులో జరిగింది. రైతుల సమస్యలు, పశుసంవర్ధన, వ్యవసాయ సాంకేతికతలపై చర్చలు జరిగిన ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొని, కోనసీమ కొబ్బరి రైతులతో మాట్లాడారు. "పచ్చని కోనసీమను చూసి తెలంగాణ నేతలు ఈర్ష్య పడ్డారు. ఆ పచ్చదనమే రాష్ట్ర విభజనకు ఒక కారణం. నరుడు దిష్టికి నల్ల రాయి కూడా బద్దలై పోతుంది, కోనసీమ కొబ్బరి చెట్లకు కూడా అదే జరిగింది" అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇది తెలంగాణ ప్రజల్ని అవమానించడమేన్న విమర్శలు ప్రారంభమ య్యాయి.
మొదట బీఆర్ఎస్ నేతలు.. తర్వాత కాంగ్రెస్ నేతలు ఈ వ్యాఖ్యలను ఖండించి.. పవన్ క్షమాపణలు చెప్పాలనిడమాండ్ చేస్తున్నారు.