Sharmila criticized Chandrababu Tours to Delhi : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నెలలో నాలుగు సార్లు ఢిల్లీ పర్యటనలకు వెళ్లినా రాష్ట్రానికి ఏమీ ప్రయోజనం లేదని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల విమర్శలు గుప్పించారు. అయిననూ పోయి రావలె హస్తినకు అన్నట్లుంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఢిల్లీ పర్యటనలని ఆమె మండిపడ్డారు.   NDA కూటమిలో పెద్దన్న పాత్రగా, ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన మీరు... ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నారని ఎక్స్ లో ప్రశ్నించారు.  ముక్కుపిండి విభజన సమస్యలపై పట్టుబట్టాల్సింది పోయి బీజేపీ పెద్దలకు జీ హుజూర్‌ అంటూ సలాంలు ఎందుకు కొడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. 


నెలలో ఒక్క హామీపైనా ప్రకటన చేయించలేకపోయారన్న షర్మిల                  


కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడి నెల రోజులు దాటినా.. మోడీతో గానీ ,ఇతర మంత్రులతో గానీ ఒక్క హామీ మీద ఎందుకు ప్రకటన చేయించలేక పోయారో చెప్పాలన్నారు.   గెలిచిన రోజు నుంచి నాలుగు సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్ర ప్రయోజనాలపై ఒక్క ప్రకటన కూడా రాలేదన్నారు.  విశాఖ ఉక్కు  ప్రైవేటీకరణ ఉండదు అని కేంద్ర పెద్దలతో చెప్పించ లేకపోయారన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కి నిధులపై స్పష్టత  తీసుకురాలేకపోయారని..  రాజధాని నిర్మాణం పై కేంద్రం ఇచ్చే సహాయం ఏంటో చెప్పలేకపోయారని  విమర్శించారు.  “ఒడ్డు దాటేదాకా ఓడ మ‌ల్ల‌న్న‌.. దాట‌క బోడి మ‌ల్ల‌న్న “. ఇదే బీజేపీ సిద్ధాంతం. బాబు గారు ఇప్పటికైనా కళ్లు తెరవడం మంచిని సలహా ఇచ్చారు.  మరోసారి రాష్ట్ర ప్రజల మనోభావాలతో బీజేపీ ఆటలు అడుకుంటుంది అని గుర్తిస్తే మంచిదన్నారు. 


నెలలో నాలుగు సార్లు ఢిల్లీకి వెళ్లిన   చంద్రబాబు


కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న తరుణంలో రాష్ట్ర డిమాండ్లను వివరించేందుకు చంద్రబాబు ఇటీవలి కాలంలో రెండు సార్లు ఢిల్లీ వెళ్లారు. ప్రధాని, హోంమంత్రి సహా కేంద్ర మంత్రుల్నికలిసి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఖర్చు పూర్తి స్థాయిలో భరించేందుకు కేంద్రం ఆమోదం తెలిపిదన్న ప్రకటన వచ్చింది. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని..  కేంద్రమంత్రి కుమారస్వామి ప్రకటించారు. ఇంకా బడ్జెట్‌లో పోలవరం, అమరావతికి నిధులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనలపై షర్మిల ముందుగానే విమర్శలు గుప్పిస్తున్నారు. 


వైసీపీ కంటే దూకుడుగా స్పందిస్తున్నషర్మిల                                     


ఏపీలో వైసీపీ 39 శాతం ఓట్లు తెచ్చుకుని ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ ఆ పార్టీ నేతలు యాక్టివ్ గా లేరు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై పోరాటంలో వారు చురుగ్గా లేకపోవడంతో షర్మిల అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. టీడీపీ ప్రభుత్వంపై ముందస్తుగా విమర్శలు గుప్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వైఎస్ జయంతిని కూడా ఘనంగా నిర్వహించి.. హాట్ టాపిక్ అయ్యారు.