Heavy Rains Due To Cyclone Affect In AP: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతానికి ట్రింకోమలీకి 100 కిలోమీటర్లు, నాగపట్నానికి 320, పుదుచ్చేరికి 410, చెన్నైకి 490 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 12 గంటల్లో వాయుగుండం శ్రీలంక తీరాన్ని దాటి తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనించనుంది. ఈ నెల 30 (శనివారం) ఉదయం ఉత్తర తమిళనాడు - పుదుచ్చేరి తీరాల వెంట కారైకాల్ - మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని చెప్పారు. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల్లో దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. శుక్ర, శనివారాల్లో రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 - 45 కిలోమీటర్ల వేగంతో.. గరిష్టంగా 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.


ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్


ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, సత్యసాయి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం.. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప్రకాశం, సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అలాగే, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నంద్యాల, అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 


శనివారం.. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అటు, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లా, ప.గో, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఆదివారం.. విజయనగరం, విశాఖ, కాకినాడ, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు.


ఈ నెల 30 వరకూ మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాల క్రమంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు పంట పొలాల్లో అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాటు చేసుకోవాలన్నారు.


Also Read: YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్