AP Cabinet meeting : ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్న ఉచిత బస్సు స్కీమ్‌పై మంత్రులకు చంద్రబాబు కేబినెట్ మీటింగ్ లో దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కేబినెట్ మంత్రులను సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సింగపూర్ పర్యటనకు సంబంధించిన అంశాలను మంత్రులకు చంద్రబాబు వివరించారు. జగన్ దెబ్బకు సింగపూర్ వాళ్లు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు రావడానికి ఇష్టపడటం లేదన్నారు. సీఐడీ పేరుతో అక్కడికి వెళ్లి సింగపూర్ మంత్రులను బెదిరించారని చంద్రబాబు చెప్పారు. కేసులు పెడతామని వాళ్లను బెదిరించారన్నారు. ఈ కారణంగానే సీడ్ క్యాపిటల్‌లో తాము భాగస్వామ్యం అయ్యేది లేదని చెప్పారన్నారు.
అయితే స్నేహ సంబంధాలు కొనసాగించాలని సింగపూర్ ప్రభుత్వాన్ని కోరామన్నారు. అక్కడి పారిశ్రామికవేత్తలను పార్టనర్షిప్ సమ్మిట్ కు రావాలని అహ్వానించానన ితెలిపారు. కేబినెట్ సమావేశంలో కొత్త బార్ పాలసీను ఆమోదించారు. కల్లు గీత కార్మికుల కోసం పది శాతం బార్లు కేటాయించారు. వాటిలో బినామీలు ఉండకూడదని.. కల్లు గీత కార్మికులకే దక్కాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉచిత ప్రయాణం ప్రారంభానికి ముందే.. ఆటో డ్రైవర్లను పిలిపించి మాట్లాడాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో సూచించడంతో చంద్రబాబు అంగీకరించారు. ఆటో డ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
మంత్రులు ఏడాది కాలంలో మెరుగ్గా పనిచేశారు.. ఇక నుంచి పరిపాలనలో దూకుడు పెంచాలని సలహా ఇచ్చారు. తప్పుడు వార్తలు నిజం చేసే దిశగా వైసీపీ కుట్రలు చేస్తోందని ..వైసీపీ కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పోలీసులు, రాజకీయ నేతలు అప్రమత్తంగా ఉండాల్సిందేనన్నారు. అంతర్జాతీయ సంబంధాల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. సింగపూర్ విధానాలు అధ్యయనం చేసేందుకు.. మంత్రులు దశల వారీగా సింగపూర్ వెళ్లాలని సూచించారు. ప్రజల్లో ప్రభుత్వంపై పూర్తి సానుకూలత ఉంది..మంత్రుల పనితీరుతో ప్రజల్లో సానుకూలత పెరగాలన్నారు. జనసేన, బీజేపీ నేతలు మాట్లాడుకుని లోపాలు సరిదిద్దుకోవాలి.. తమ శాఖలపై మంత్రులు రిపోర్టు తయారుచేసుకోవాలని సూచించారు. వచ్చే కేబినెట్ సమావేశం నుంచి ఒక్కో మంత్రితో తమశాఖ ఘనతపై మాట్లాడిస్తామన్నారు.
సిట్ దర్యాప్తు ఆధారంగా అరెస్టులు ఉంటాయి.. లిక్కర్ కేసు విషయంలో మంత్రులు ఆచితూచి స్పందించాలని మంత్రులకు సూచించారు. బీసీ వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లుగా మంత్రి పార్థసారధి తెలిపారు. నాయి బ్రాహ్మణుల సెలూన్లకు రెండు వందల యూనిట్ల వరకూ ఉచిత కరెంట్ ఇస్తున్నామన్నారు.