MLA Koneti Adimulam: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే, తిరుపతి నుంచి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన కోనేటి ఆదిమూలం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో సమావేశం అయ్యారు. తిరుపతి జిల్లా సత్యవేడు (ఎస్సీ) నియోజకవర్గానికి చెందిన అధికార వైసీపీకి చెందిన శాసనసభ్యుడు కోనేటి ఆదిమూలం.. ఈ మధ్యే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆరోపణలు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి తన నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్‌రెడ్డి దళితులపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని, వారికి ఇష్టానుసారంగా షరతులు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీలో చేరేందుకు కోనేటి ఆదిమూలం రెడీ
ఇప్పుడు టీడీపీలో చేరేందుకు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం సిద్ధమయ్యారు. నారా లోకేష్‌తో కోనేటి ఆదిమూలం, ఆయన తనయుడు సమావేశం అయ్యారు. మరో రెండు, మూడు రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకుంటారని అనుచరులు చెబుతున్నారు. ఇ సీపీ అధిష్ఠానం ఎమ్మెల్యే సీటు కాకుండా ఎంపీ స్థానాన్ని ఇవ్వడంపై అసంతృప్తితో ఉన్న ఆదిమూలం.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు. పార్టీలో కనీస గౌరవం ఇవ్వలేదని.. జిల్లా రెడ్లుదే రాజ్యం అంటూ విమర్శలు గుప్పించారు. సత్యవేడు టిక్కెట్‌ను తిరుపతి ఎంపీ గురుమూర్తికి కేటాయించారు.
మంత్రి పెద్దిరెడ్డి వ్యవహారశైలిపై రిజర్వుడు నియోజకవర్గాల ఎమ్మెల్యేల అసహనం
సీఎం వైఎస్ జగన్, మంత్రి రామచంద్రారెడ్డి పట్టించుకోకుండా తిరుపతి (ఎస్సీ) లోక్‌సభ స్థానానికి మార్చి తనను మోసం చేశారనేది కోనేటి ఆదిమూలం ప్రధాన ఆరోపణ. రోజా, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి అన్యాయం చేయగలరా? అని ప్రశ్నింారు. తనపై జగన్ మోహన్ రెడ్డికి ప్రతికూల నివేదికను రామచంద్రారెడ్డి అనుచరులు సిద్ధం చేశారని ఆరోపించారు.
ఎస్సీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడు రిజర్వుడు స్థానాల్లో గత ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. అయితే మూడు స్థానాల్లోనూ ఈ సారి అభ్యర్థుల్ని మార్చారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని కూడా చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా ఉన్న రెడ్డప్పకు ఆయన స్థానం కేటాయించారు. గంగాధర నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల్ని మార్చారు. ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు టిక్కెట్ నిరాకరించడంతో ఆయన కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దళితులంటే వైసీపీకి చిన్న చూపని మండిపడ్డారు.