Chandrababu : పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బడుగుబలహీన వర్గాల ఆత్మీయ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  పాల్గొన్నారు. బీసీలు రాజకీయంగా, సాంస్కృతికంగా వెనుకబడ్డారని, అలాంటి వారికి వెన్నుదన్ను ఇచ్చి, ముందుకు నడిపించింది ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు చెప్పారు. టీడీపీ పెట్టక ముందు..పెట్టాక బీసీల పరిస్థితి ఏమిటో మీరే ఒకసారి మనస్ఫూర్తిగా బేరీజు వేసుకోవాలని, బీసీలను రాజకీయంగా వృద్ధిలోకి తీసుకొచ్చింది ఎన్టీఆర్ అని తెలిపారు.  బీసీలకు 24 శాతంరిజర్వేషన్లు ఇచ్చి, వారిని రాజకీయంగా ప్రోత్సహించారని గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీకి బడుగు, బలహీన వర్గాలే వెన్నెముక అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఎంత మంది వచ్చి ఎన్ని మాయ మాటలు చెప్పి, కుప్పిగంతులు వేసినా చివరకు బీసీలను ఆదుకునేది, వారికి అండగా ఉండేది టీడీపీ అనడంలో సందేహం లేదన్నారు. కింజరాపు ఎర్రన్నాయుడి నుంచి దేవేందర్ గౌడ్, కే.ఈ.కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు,  అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, రామ్మోహన్ నాయుడు, కొల్లు రవీంద్ర లాంటి వందల కొద్దీ నాయకుల్ని తయారుచేసింది టీడీపీ అని చంద్రబాబు చెప్పారు. 


సబ్ ప్లాన్ తెచ్చింది కూడా టీడీపీనే 


సబ్ ప్లాన్ తీసుకొచ్చి వెనుకబడిన వర్గాలకు రూ.36 వేల కోట్లు ఖర్చుపెట్టింది తెలుగుదేశం పార్టీ హయాంలోనేనని, సబ్ ప్లాన్ కాకుండా, కులవృత్తులు, చేతివృత్తులకు అండగా నిలవడానికి ఆదరణ పథకం తీసుకొచ్చామన్నారు. ఆధునికమైన పనిముట్లు, యంత్రాలు అందించామని చెప్పారు. వెనుకబడిన వర్గాలు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదని, జనాభాలో 50 శాతం కంటే ఎక్కువ ఉన్న బీసీల కోసం తెలుగుదేశం అనునిత్యం పనిచేస్తుందని వివరించారు.


కార్పొరేషన్లు ఎవరి కోసం ఉన్నాయో తెలియదు 


వైసీపీ వేసిన కార్పొరేషన్లు ఎవరి కోసమో, ఎందుకు పనికొస్తాయో చెప్పాలని చంద్రబాబు సవాల్ చేశారు. వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి  వేసిన ఫెడరేషన్లతో ఎంతమంది బీసీల తలసరి ఆదాయం పెంచారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు ఇవ్వడానికి తీసుకొచ్చిన పనిముట్లు, పరికరాలు, యంత్రాలను తుప్పుపట్టేలా చేసిన పార్టీ వైసీపీ అని, వైసీపీ ప్రభుత్వం వేసిన ఫెడరేషన్లు ముఖ్యమంత్రి భజనకే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ఆస్తులన్నీ దోచుకొని తానొక్కడే లక్షల కోట్లు సంపాదించుకోవాలన్నదే జగన్ ఫిలాసఫీ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ విసిరే ఎంగిలి మెతుకుల కోసం ప్రజలు ప్రతిరోజు ఎదురు చూడాలని, ఇదెక్కడి న్యాయం అని చంద్రబాబు ప్రశ్నించారు. 2004లో జగన్ ఆస్తిఎంత? 2023లో ఆయన ఆస్తి ఎంత? రూ.43 వేల కోట్లు దోచుకుంటే సీబీఐ, ఈడీలు ఛార్జ్ షీట్లు వేశాయని అన్నారు.


కొంప ముంచిన ఇసుక పాలసీ 


బీసీల్లో చాలా మంది నిర్మాణ రంగంపై ఆధారపడి బతుకుతున్నారని, జగన్ కొత్త ఇసుక పాలసీ వల్ల 50 లక్షల కుటుంబాలు రోడ్డునపడ్డాయన్నారు. దేవుడిచ్చిన సహజ వనరుల్నికూడా దోచేస్తున్న వ్యక్తి జగన్, 5 ఏళ్లలో భూదోపిడీ, ఇసుక కదోపిడీ, మద్యంపై దోపిడీ , అవి చాలవన్నట్టు ప్రజల ఆస్తులు రాయించుకునే స్థితికి వచ్చారని, తుపాకీ చూపి బెదిరించి ఆస్తులుకొట్టేస్తున్నారని విమర్శించారు. రూ.510 కోట్లతో దేశంలోనే అత్యంతధనవంతుడైన ముఖ్యమంత్రిగా జగన్ నిలిచారని అన్నారు. ఆయన పాలనలో బీసీల ఆస్తులు, ఆదాయం పెరిగిందా? రూ.5 లక్షల కోట్ల భారాన్ని బాదుడేబాదుడు అంటూ ప్రజలపై వేశారని అన్నారు. రూ.10 లక్షల కోట్ల అప్పులు రాష్ట్రంపై వేశారని, అమ్మఒడి, వసతిదీవెన, విద్యాదీవెన కంటే మెరుగ్గా నాన్నబుడ్డి అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.