Anantapur News: ఆయన ఒక ప్రభుత్వ డాక్టర్.. అతను పేరుకే డాక్టర్ కానీ ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) లో పనిచేసే మహిళలకు మాత్రం ఆయన ఓ కామాంధుడు! అక్కడ పని చేస్తున్న తమ పాలిట కామ పిశాచి అని పీహెచ్‌సీలోని ఏఎన్ఎంలు ఆరోపణలు చేశారు. సదరు ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న డాక్టర్ పుల్లేటిపల్లి ఉదయ్ తమ పాలిట యముడిలా మరాడని వారు వాపోయారు.
శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని ఎన్ ఎస్ గేట్ మండలంలో ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్ కామ లీలలకు హాస్పిటల్లోని ఏఎన్ఎంలకు ఉద్యోగం చేయాలంటేనే సాహసంగా మారింది. ఎన్ ఎస్ గేట్ మండలంలోని ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్ ఉదయ్ గత కొన్ని నెలలుగా తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఆ కేంద్రంలో పనిచేస్తున్న మహిళలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. వారిని డైరెక్ట్ గా కాకుండా వారి వాట్సాప్ చాట్ లో తమను లైంగికంగా వేధిస్తున్నాడని తెలిపారు.
ఆ డాక్టర్ చేసిన వాట్సాప్ చాటింగ్ లను బాధిత మహిళలు బయటపెట్టారు. వాట్సప్ చాటింగ్ లో చాలా అసభ్యకరమైన పదజాలంతో మెసేజ్‌లు చేసేవాడని.. తమను కాకుండా తమ కూతుర్లను కూడా తన దగ్గరకు పంపాలని అడిగేవాడని వాపోయారు. డాక్టర్ ఉదయ్ పుల్లేటిపల్లి చేస్తున్న అరాచకాలు తట్టుకోలేని ఏఎన్ఎంలు.. పైఅధికారులైన జిల్లా అధికారికి ఫిర్యాదు చేశారు.
విచారణ చేపట్టిన అధికారులు
ఎన్ ఎస్ గేట్ మండలంలోని ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్ పుల్లేటిపల్లి ఉదయ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి మంజువాణి విచారణ చేపట్టేందుకు ఒక టీం ను ఏర్పాటు చేశారు. ఆ టీమ్‌ను ఎస్ ఎస్ పేట్ మండల ఆరోగ్య కేంద్రానికి పంపించారు. అలా వారు బుధవారం (జూన్ 26) విచారణకు రాగా.. అధికారుల టీం పీహెచ్‌సీలో పని చేస్తున్న ఏఎన్ఎంలను.. ఇతర సిబ్బందిని ఆరా తీశారు. డాక్టర్ ఉదయ్ పై వచ్చిన ఆరోపణలు ఏంటి? ఎప్పటి నుంచి ఇలా జరుగుతోంది.. ఎవరెవరికి ఆయన వాట్సాప్ మెసేజ్ లు చేశాడు.. ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న కోణంలో విచారణను చేపట్టారు. సమగ్ర విచారణ జరిపి పైఅధికారులకు నివేదిక ఇస్తామని సత్యసాయి జిల్లా DM & HO మంజువాణి ఏబీపీ దేశంకు తెలిపారు.