APSRTC Sankranti Special Buses: సంక్రాంతి... తెలుగు ప్రజలకు పెద్దపండుగ. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. హైదరాబాద్‌తోపాటు ఇతర  ప్రాంతాల్లో ఉన్నవారంతా సొంతూళ్లకు వచ్చి... కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కలిసి పండుగ చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ వాసులంతా... సొంత గ్రామాలకు ప్రయాణం కడతారు. దీంతో బస్సులు, రైళ్లు అన్నీ ముందే నిండిపోతాయి. మూడు, నాలుగు నెలల ముందే రిజర్వేషన్లు అయిపోతాయి. దీంతో ప్రత్యేక బస్సులు,  రైళ్లు అందుబాటులోకి తెస్తుంటారు.


ప్రత్యేక బస్సులు


ప్రతి ఏడాదిలాగే... ఈ సంక్రాంతికి కూడా రెగ్యులర్‌ బస్సుల్లో టికెట్లన్నీ ముందే అయిపోయాయి. దీంతో ప్రత్యేక బస్సులను నడుపుతోంది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ  (APSRTC). మొత్తం 6,795 స్పెషల్ బస్సులను సంక్రాంతి పండుగ కోసం నడపుతోంది. అంతేకాదు.. స్పెషల్‌ బస్సుల్లో ఈసారి అదనపు ఛార్జీలు వసూలు చేయడంలేదు.  సాధారణ ఛార్జీలే వసూలు చేస్తున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ పేర్కొంది. అందేకాదు.. రానుపోనూ ఒకేసారి టికెట్లు బుక్ చేసుకున్నవారికి 10 శాతం డిస్కౌంట్ కూడా ఇస్తున్నట్లు  ప్రకటించింది.


పది నుంచి ప్రత్యేక బస్సులు


ఈనెల 10 నుంచి 13వ తేదీ మధ్యలో రెగ్యులర్‌ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లు ఇప్పటికే పూర్తయ్యాయని, అందుకే.. ఆయా మార్గాల్లో ప్రత్యేక బస్సు సర్వీసులను  అందుబాటులోకి తెస్తున్నట్టు ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు. వీటిల్లో కూడా రిజర్వేషన్లు మొదలైనట్టు తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సర్వీసులు  పెంచుతామని ప్రత్యేక బస్సుల పర్యవేక్షణకు సూపర్‌వైజర్లు అందుబాటులో ఉంటారని చెప్పారు. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలతోపాటు హైదరాబాద్, బెంగళూరు,  చెన్నై, కర్ణాటక, తమిళనాడులోని ఇతర ప్రాంతాలకు ఈ ప్రత్యేక బస్సులను నడపుతున్నారు. 


18 వరకు ప్రత్యేక బస్సులు


నేటి (జనవరి 6వ తేదీ) నుంచి 18వ తేదీ వరకు స్పెషల్ బస్సులు నడవనున్నాయి. సంక్రాంతికి ముందుగా.. ఇవాళ్టి (జనవరి 6వ తేదీ) నుంచి 14వ తేదీ వరకు 3,570  ప్రత్యేక బస్సులు, తిరుగు ప్రయాణాల కోసం ఈనెల 16 నుంచి 18 వరకు 3,225 బస్సులు నడుపుతున్నారు. సంక్రాంతి ముందు నడిపే బస్సుల్లో హైదరాబాద్‌ నుంచి 1600,  బెంగళూరు నుంచి 250, చెన్నై నుంచి 40, విజయవాడ నుంచి 300, విశాఖ నుంచి 290, రాజమండ్రి నుంచి 230, తిరుపతి నుంచి 70, ఇతర ప్రాంతాల నుంచి 790  బస్సులు ఏర్పాటు చేశారు. 


నార్మల్ ఛార్జీలే


సంక్రాంతి తర్వాత అంటే ఈనెల 16 నుంచి 18 వరకు హైదరాబాద్‌ నుంచి 1,500, బెంగళూరు నుంచి 495, చెన్నై నుంచి 85 సర్వీసులు, విజయవాడ నుంచి 200, విశాఖపట్నం  నుంచి 395,  రాజమహేంద్రవరం నుంచి 50, తిరుపతి నుంచి 50, రాష్ట్రంలోని ఇతర జిల్లా కేంద్రాల నుంచి 700 ప్రత్యేక సర్వీసులను నడుపనున్నారు. చార్జీలకు చిల్లర సమస్య లేకుండా యూటీఎస్‌ మెషిన్ల ద్వారా టికెట్ల జారీ విధానాన్ని ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు ఫోన్‌పే, గూగుల్‌ పే, క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయడం ద్వారా టికెట్లు  తీసుకోవచ్చు. 


వాస్తవానికి... సంక్రాంతి, దసరా పండుగలకు నడిపే ప్రత్యేక బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తూ ఉంటారు. సాధారణ చార్జీలపై 50శాతం అధికంగా వసూలు చేసేవారు. దీని  వల్ల ప్రయాణికులపై ఆర్థిక భారం పడేది. అయితే... ఈసారి ఆ విధానానికి స్వస్తి పలికింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ సర్కార్‌. సాధారణ చార్జీలతోనే పండుగ ప్రత్యేక సర్వీసులను  నడపాలని నిర్ణయించింది. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ సదుపాయం కూడా కల్పించింది. అంతేకాదు... ఒకేసారి రానూపోనూ రిజర్వేషన్‌ చేసుకుంటే 10శాతం  రాయితీ కూడా ఇస్తోంది. దీంతో సాధారణ చార్జీల కంటే తక్కువగానే ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది.