AP Sand Issue : ఏపీ ఇసుక అక్రమంగా పొరుగు రాష్ట్రాలకు తరలి పోతోంది. ఏపీ ప్రజలకు అత్యధిక ధర పెట్టినా ఇసుక దొరకని పరిస్థితి. కానీ ఏపీ ఇసుక మాత్రం పొరుగు రాష్ట్రాలకు తరలిపోతోంది. యన్ టి ఆర్ జిల్లా చందర్లపాడు మండలం కొడవటికల్లు వద్ద కృష్ణా నది నుండి హైదరాబాద్ కు ఇసుక తరలించడానికి నిత్యం తెలంగాణాకు చెందిన లారీలు సిద్దంగా ఉంటున్నాయి. ఈ ప్రాంతంలో సామాన్యుడికి చెంచా ఇసుక కూడ అందటం లేదు. అయితే పెద్దలకు మాత్రం లారీలకు లారీలు..టన్నులకు టన్నుల ఇసుక తరలి వెళ్లిపోతోంది.
నిజానికి ఏపీలో ఇసుక మొత్తం జేపీ వెంచర్స్ అనే సంస్థ చేతిలో ఉంది. ఆ సంస్థ తమిళనాడు కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్లుగా ప్రచారంలో ఉంది. ఏ సంస్థ అయినా ఇసుకను ఏపీలో ప్రజావసరాలకు అమ్ముకోవాలి. ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. అయితే చందర్ల పాడు నుంచి ఇసుకను జేపీ కంపెనీ తరలిస్తోందా.. స్దానికంగా ఉన్న రాజకీయ నాయకుల జోక్యంతోనే జరుగుతుందా అనే దానిపై స్పష్టత లేదు. కానీ.. స్థానిక నేతల ప్రమేయం ఎక్కువ ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాల్సిన సెబ్ అధికారులు కూడ పట్టించుకోవటం లేదు..భారీ లోడింగ్ సామర్ద్యం కలిగిన లారీల్లో టన్నుల కొద్ది ఇసుక లోడింగ్ జరుగుతుంది.ఆ తరువాత సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలకు ఇసుక తరలిపోతుంది.ఇక్కడ బిల్డర్లు కీలక పాత్ర పోషిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఏపీకి చెందిన నాయకులు చాలా మంది తెలంగాణాలో రియల్ ఎస్టేట్ బిల్డర్లు గా అవతారం ఎత్తారు. మరి కొందరు రాజకీయ పార్టి నేతల ను అండగా చేసుకొని చక్రం తిప్పుతున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇసుక కు కొదవ లేకుండాపోయింది.అదే సామాన్యుడికి మాత్రం ఇసుక అందని ద్రాక్షగా మారింది.
హైదరాబాద్ వెళ్ళే లారీలకు నదిలో లోడింగ్ చేసినందుకు ఒక్కో లారీకి 25 నుండి 35 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు.ఇదంతా జే పి వెంచర్స్ కు చెందిన ప్రైవేట్ సిబ్బంది వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇక్కడ నుండి తీసుకువెళ్లిన ఇసుక హైదరాబాదు లో టన్ను 3000 రూపాయలు చొప్పున అమ్మకాలు సాగిస్తున్నారని అధికారులకు ఫిర్యాదులు అందినా, వాటిని పట్టించుకోవడం లేదు. అందుకే వారికీ వాటా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో ఎపీ అదికారులు సీరియస్ గా దృష్టి సారించి అక్రమ ఇసుక తరలింపు పై చర్యలు తీసుకోవాలని అంటున్నారు.