వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ( YS Viveka Murder Case ) పథకం ప్రకారం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy ) ఆరోపించారు. సీబీఐ చార్జ్ షీట్ పేరుతో సంబంధం లేని వారిని హత్య కేసులో ఇరికిస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లోని అంశాలు వెలుగులోకి రావడం వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ( MP Avinash Reddy ) ప్రధాన అనుమానితుడిగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడి కావడంపై సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
సీబీఐ అధికారులపై ( CBI ) ఆరోపణలు చేశారు. సీబీఐ అధికారులు పథకం ప్రకారం విచారణ చేస్తూ వైఎస్ఆర్‌సీపీ నేతల్ని ( YSRCP Leaders ) ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సీబీఐ అధికారులపై ఇప్పటికే పలువురు అనుమానితులు ఫిర్యాదులు చేశారని గుర్తు చేశారు. వారందరిపై సీబీఐ ధర్డ్ డిగ్రీ ప్రయోగించి వైఎస్ఆర్సీపీ నేతల పేర్లు చెప్పాలని ఒత్తిడి చేస్తోందని చెబుతున్నారని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. వివేకాను హత్య చేసేందుకు జరిగిన కుట్ర కంటే ఇప్పుడు పెద్ద కుట్ర జరుగుతోందని సజ్జల ఆరోపించారు. శివప్రకాష్ రెడ్డి ( Siva Prakash Reddy ) అనే వ్యక్తి ఫోన్ చేస్తేనే అవినాష్ రెడ్డి వివేకా హత్యకు గురైన స్థలానికి వెళ్లారన్నారు.
వైఎస్ వివేకా కుమార్తె సునీతపై ( YS Sunita ) సజ్జల పలు ఆరోపణలు చేశారు. హ త్య జరిగిన రోజున హత్య చేసినట్లుగా ఉన్న ఓ లెటర్‌ను సాయంత్రం వరకూ ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. అలాగే పలు సందర్భాల్లో సునీత మాట్లాడిన మాటలను ఆయన వీడియో రూపంలో ప్రదర్శించారు. వివేకా హత్య జరిగినప్పుడు చంద్రబాబు ( Chandra babu ) సీఎంగా ఉన్నారని.. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆ అధికారులే విచారణ జరిపారని సజ్జల తెలిపారు. అవినాష్ రెడ్డి గెలుపు కోసం వైఎస్ వివేకానందరెడ్డి పని చేశారని ఆయనను ఎందుకు హత్య చేయడానికి కుట్ర పన్నుతారని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఎంపీ టిక్కెట్ కోసం హత్య జరిగిందనే కోణంలో చార్జిషీట్ రాయడం అసంబద్దమన్నారు.
వివేకా హత్య ఘటన వెనుక టీడీపీ ఉండి ఉంటుందని సజ్జల ఆరోపించారు. ప్రతీ దాన్ని రాజకీయం చేయడం టీడీపీకి అలవాటేనన్నారు. బాధితులనే దోషులకు చిత్రీకరించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. వివేకా కేసులో వాస్తవాలు బయటకు రావాలని అందరూ కోరుకుంటున్నారని అన్నారు. సీబీఐ చార్జిషీట్‌ను ఖచ్చితంగా చాలెంజ్ చేస్తామని ప్రకటించారు.