Chandrababu Naidu Arrest  :  స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో  కుంభకోణాన్ని చంద్రబాబు విజయవంతంగా అమలు చేశారని, కానీ  వైసీపీ కక్షపూరితంగానే ఇదంతా చేస్తోందని తమపై ఆరోపణలు చేస్తున్నారని  ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.  లక్ష మంది గోబెల్స్ కలిస్తే ఒక చంద్రబాబునాయుడు అని, ప్రజలు నమ్మక చస్తారా అనే రీతిలో టీడీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని సజ్జల విమర్శించారు.  చంద్రబాబు అరెస్ట్ ప్రజాస్వామ్యానికే పెద్ద విఘాతం అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


చంద్రబాబుకు మద్దతు పలుకుతున్న ఇతర పార్టీల నేతలపై సజ్జల ఘాటు విమర్శలు చేశారు.  కమ్యూనిస్టు పార్టీలు, మిగతా పార్టీల వాళ్లు కూడా చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నారని, వాళ్లెంతకు అమ్ముడుపోయారని ప్రశ్నంచారు.  చంద్రబాబు మదిలో మాటలను ఎందుకు చిలకపలుకుల్లా పలుకుతున్నారో ఆయా పార్టీల నేతలు ఓసారి ఆలోచించుకోవాలన్నారు.  చంద్రబాబుకు మద్దతివ్వడం సరైనదేనా? అని ప్రశ్నించారు. విషయం ఉంటే మాట్లాడండి... స్కాం గురించి ఎవరూ ఎందుకు మాట్లాడడంలేదన్నారు.                                                           


ఆధారాలను  ప్రభుత్వం కోర్టు ముందు ఉంచిందని, చంద్రబాబుకు రిమాండ్  విధించింది కోర్టే కదా అని వ్యాఖ్యానించారు. ఇందులో జగన్ కక్షపూరితంగా వ్యవహరించింది ఎక్కడ? అని ప్రశ్నించారు. ప్రజాధనం దోపిడీకి గురైందని సీఐడీ దర్యాప్తు చేసి ఆధారాలు సమర్పించిందని తెలిపారు.  "కక్ష సాధించాలని అనుకుంటే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు హెలికాప్టర్ పెట్టాల్సిన అవసరం లేదు... ఏదో ఒక లారీ పెట్టొచ్చు, లేదా వ్యాన్ లో ఎక్కించి తీసుకుని రావొచ్చు. దొంగతనం చేసి సానుభూతి కోరుకుంటున్నారు. ఐదు కోట్ల మందికి పచ్చ కళ్లద్దాలు పెట్టాలని, చెవిలో కాలీఫ్లవర్ లు పెట్టాలని చూస్తున్నారు. రాష్ట్రపతికి వినతిపత్రం ఇచ్చారు... రేపు ఐక్యరాజ్యసమితికి కూడా వినతిపత్రం ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు" అని సజ్జల సెటైర్ వేశారు. 


మేధావులు అనుకుంటున్న కొందరితో స్టేట్‌మెంట్లు ఇప్పిస్తున్నారని సజ్జల పేర్కొన్నారు. తాము రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నామని ఆరోపిస్తున్నారని..అలా చేయాలంటే అధికారంలోకి వచ్చిన వెంటనే అరెస్ట్ చేసేవాళ్లమని వ్యాఖ్యానించారు. అప్పటికే కావాల్సిన ఆధారాలు ఉన్నాయన్నారు. పూర్తిగా విచారణ చేసిన తరువాత సీఐడీ అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టిందని చెప్పుకొచ్చారు.  


ఆదానీ ముఖ్యమంత్రి జగన్ ను కలవటంలో రహస్యం లేదన్నారు. పెట్టుబడుల అంశం పైన చర్చించేందుకే సీఎం నివాసానికి వచ్చారని చెప్పారు. టీడీపీ అంటే తోడు దొంగల పార్టీ. ముఠా నాయకుడు చంద్రబాబును కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని సజ్జల వ్యాఖ్యానించారు. ఈ కేసుల్లో పూర్తి ఆధారాలు కోర్టుకు సమర్పిస్తుందని వివరించారు. ఈ నాలుగు కేసుల్లోనూ కిలారి రాజేశ్ కీలకంగా ఉన్నారని వెల్లడించారు. చంద్రబాబు పీఏగా పని చేసే వ్యక్తి సచివాలయంలో ఉద్యోగిగా ఉంటూ అకస్మికంగా అమెరికా ఎలా వెళ్లారని ప్రశ్నించారు.