ABP  WhatsApp

Sajjala: ఇది చిల్లర చేష్టలాగే ఉంది, ఈ భారీకుట్ర వెనుక ఎవరున్నారో తేలాలి - వివేకా కేసులో జగన్ పేరుపై సజ్జల

ABP Desam Updated at: 26 May 2023 10:49 PM (IST)

సీబీఐ కౌంటర్‌ అఫిడవిట్‌లో సీఎం జగన్‌ పేరును ప్రస్తావించడం వెనక భారీ కుట్ర ఉందని, దీనిపై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని సజ్జల అన్నారు.

సజ్జల రామకృష్ణారెడ్డి (ఫైల్ ఫోటో)

NEXT PREV

తెలంగాణ హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేరును ప్రస్తావించడం వెనుక పెద్ద కుట్ర ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ భారీ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. అసలు దీనిపై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. సీబీఐ విపరీత ధోరణికి, సెన్సేషనలైజేషన్‌కు ఇది నిదర్శనమని అన్నారు. సీబీఐ దిగజారిపోయి వ్యవహరిస్తోందని అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం (మే 26) రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.


వివేకా హత్య కేసులో అవినాష్‌ను, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ను టార్గెట్‌ చేసుకుంటూ ఒక పద్ధతి ప్రకారం ఎల్లోమీడియా ప్రచారం చేసుకుంటూ వస్తోంది. ఒక స్క్రిప్టు రాసుకుని.. దాని విస్తృతంగా ప్రచారం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఎలాంటి ఆధారాలు లేకుండా చవకబారు ఆరోపణలు చేస్తున్నారు. కేవలం సెన్షేషనలైజేషన్‌ కోసమే ఇవన్నీ చేస్తున్నారు. సీబీఐ ఏం చేయాలనుకుంటుందో ఈ ఎల్లో మీడియాకు ఎలా ముందు తెలుస్తోంది. ఎల్లో మీడియా స్క్రిప్టు తయారుచేస్తుంటే.. దాన్ని సీబీఐ మెన్షన్‌ చేస్తోంది. దర్యాప్తు సంస్థ ఏదైనా మెన్షన్‌ చేస్తే దానికి ఆధారాలు చూపిస్తుంది. కాని ఇక్కడ అదేమీ జరగలేదు. ముందే అనుకుని అవినాష్‌రెడ్డి అరెస్టులకు ఏం కావాలో రాస్తున్నారు. ఆ స్క్రిప్టును ముందే ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తున్నారు’’


సీబీఐ ఆ అంశాలను ప్రస్తావించగానే మేం ముందుగానే చెప్పాం కదా అని అంటున్నారు. ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం సాగిపోతోంది. సీబీఐ కౌంటర్‌ వేయకుముందే దానిలో పొందుపరిచే అంశాలను ముందుగా ఎల్లోమీడియా ప్రచారం చేస్తోంది. సీబీఐ తీరులో విపరీత ధోరణి, అత్యంత అన్యాయమైన తీరు కనిపిస్తోంది. ఉన్నట్టుండి సడన్‌గా.. జగన్మోహన్‌ రెడ్డి పేరును ప్రస్తావించడమే దీనికి నిదర్శనం. అసలు దీనికి ఏ ఆధారమేదీ వాళ్లదగ్గర ఏమీ కనిపించడం లేదు. చిల్లర చేష్ట మాదిరిగా ఉంది.’’



జగన్మోహన్‌రెడ్డి పేరును ప్రస్తావించి దాన్ని సెన్షేషనలైజేషన్‌ కోసం వాడుకోవాలన్న తీరు కనిపిస్తోంది. సీబీఐ ఇలా కౌంటర్‌ అఫిడవిట్‌ విషయం తెలియగానే, టీడీపీ పొలిట్‌ బ్యూరోలో దీనిపై చర్చించడం, జగన్‌ పాత్ర అందరికీ తెలుసంటూ వారు ఆరోపణలు చేయడం.. ఇదంతా గొలుసుకట్టు మాదిరిగా ఈ వ్యవహారం నడుస్తోంది. ఇది ఒక పెద్ద కుట్ర-


ఇది ఒక పెద్ద కుట్ర
‘‘ఈ కుట్ర వెనుక ఎవరున్నారో ముందు తేల్చాలి. దానిపై అసలు దర్యాప్తు జరగాలి. ఈ కుట్రలో చంద్రబాబు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావుల పాత్రపై తేల్చాలి. సునీత, వీళ్ల మధ్య ఏముందనేది తేల్చాలి. ముందే ఎల్లో మీడియా స్క్రిప్టు తయారు చేసి, దాన్ని సీబీఐ ప్రస్తాదించడం ఇక్కడ చూడాల్సిన విషయం. సీబీఐ కౌంటర్లో పేర్కొన్న అంశంలో హేతు బద్ధత లేదు. సీబీఐ రాసింది కాబట్టి, ఈ మాటలు కూడా చెప్పాల్సి వస్తుంది. ముందుగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లలో అవినాష్‌ పేరు లేదు. .సడన్‌గా ఓ కౌంటర్‌ వేసి.. నిందితుడు అని చెప్తారు. సీబీఐ రెండునెలలు దస్తగిరిని తన దగ్గర పెట్టుకుని అవినాష్‌ పేరును ప్రస్తావనకు తెచ్చేలా చేస్తారు. ఆ తర్వాత బెయిల్‌ ఇస్తారు. 


విచిత్రంగా ఈ బెయిల్‌ను సునీత అభ్యంతరం పెట్టదు. సుమారు ఏడాదిన్నర తర్వాత అవినాష్ పేరును సీబీఐ ప్రస్తావిస్తోంది. సడన్‌గా భాస్కర్‌ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. తర్వాత అవినాష్‌ను అరెస్టు చేయాలంటారు. ఇప్పుడేమో కౌంటర్లో జగన్మోహన్‌రెడ్డి పేరును ప్రస్తావిస్తారు. అసలు వీటికి ఆధారలు ఏంటన్నది ఎవ్వరికీ తెలియదు. దర్యాప్తులో చూడాల్సిన కోణాలు ఎన్నో ఉన్నాయి. కాని, వాటి జోలికిపోరు. షమీమ్‌ స్టేట్‌మెంట్‌ను పట్టించుకోరు, ఆస్తివివాదాలను ప్రస్తావించినా సీబీఐ దాన్ని పట్టించుకోలేదు. పరమేశ్వర రెడ్డి అనే వ్యక్తి ఆస్పత్రిలో ఉండి.. మధ్యలో టీడీపీ నాయకుడు బీటెక్‌ రవిని కలిసి వస్తాడు. ఇన్ని ఉండగా వీటిని సీబీఐ పట్టించుకోలేదు. 


ఇప్పుడు ముఖ్యమంత్రికి సమాచారం పోయిందన్న ఆరోపణ సడన్‌గా చేస్తున్నారు. అందరూ చర్చించుకోవాలన్న దృక్పథంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు తప్ప వాటికి ఆధారాలు మాత్రం ఉండడం లేదు. దిగజారిపోయిన రాజకీయ పార్టీ మాదిరిగా సీబీఐ కూడా వ్యవహరిస్తోంది’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Published at: 26 May 2023 10:49 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.