Sajjala Ramakrishna Reddy: ఏపీలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం దిగిపోవడంతో ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణా రెడ్డి రాజీనామా చేశారు. ఆయనతో పాటు జగన్ ప్రభుత్వంలో నియమితులు అయిన మరో 20 మంది కూడా ప్రభుత్వ సలహాదారు పదవులకు రాజీనామాలు చేశారు. ఈ లేఖలను వారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డికి పంపారు.


జగన్ ప్రభుత్వంలో ప్రధాన సలహాదారుగా సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆయన వైఎస్ఆర్ సీపీకి ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఇంకా జాతీయ మీడియా సలహాదారుగా దేవులపల్లి అమర్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా హేమచంద్రారెడ్డి ఉన్నారు. వీరంతా ఇప్పటికే తమ రాజీనామాలు సమర్పించారు. ఫలితాలు వచ్చిన వెంటనే టీటీడీ ఛైర్మన్‌ పదవికి భూమన కరుణాకర్‌ రెడ్డి రాజీనామా చేశారు. తనను రిలీవ్ చేయాలని సమాచార పౌర సంబంధాలశాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందు పదవీ కాలాన్ని పొడిగించాలని ఆయన ప్రభుత్వానికి దరఖాస్తు పంపించారు. అలాంటిది... తనను రిలీవ్ చేయాలని తుమ్మా విజయ్ తాజాగా దరఖాస్తు చేసుకున్నారు.