Sajjala Ramakrishna Reddy: అమరావతి: తల్లిని, చెల్లిని గెంటేసిన ఏపీ సీఎం జగన్‌కు అంగన్వాడీల సమస్యలు ఎలా తెలుస్తాయని టీడీపీ నేత లోకేష్ (Nara Lokesh) చేసిన ట్వీట్ పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు. లోకేష్ వాళ్ల తాత దివంగత ఎన్టీ రామారావుకు తండ్రి చంద్రబాబు (Chandrababu) వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమయ్యాడు, అలాంటిది లోకేష్ సీఎం జగన్ మీద కామెంట్లు చేయడం ఏంటని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టడం కాదు.. తాతను తండ్రి వెన్నుపోటు చంపారని విషయం లోకేష్ కు తెలిసి ఇలాంటి కామెంట్లు చేయడం సరికాదని హితవు పలికారు. 


ఎస్మా ప్రయోగం కరెక్ట్..
అంగన్వాడీల సమ్మెపై ఏపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగం సరైందేనని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎవరి మీద కఠినంగా ఉండేందుకు ఎస్మాను ప్రయోగించలేదన్నారు. పిల్లలు, గర్భిణులు ఇబ్బంది పడుతున్నారని.. వారికి సేవలు అందించాలన్నారు. నెల మొదలైందని, ఈ నెలకు సంబంధించి అత్యవసర సేవలు అవసరం కనుక ప్రభుత్వం ఎస్మాకు మొగ్గు చూపిందన్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు వారి సమస్యల్ని పట్టించుకోలేదని ప్రశ్నించారు. బాలింతలు, గర్బిణులు, పిల్లలు ఆకలతో అలమటిస్తే చూడాలని చంద్రబాబు, లోకేష్ కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. 


స్టాన్‌ఫోర్డ్ లో చదివిన లోకేష్ కు తెలుసా?
లోకేష్ స్టాన్‌ఫోర్డ్ లో చదివారు. ఆయనకు ఎస్మా అంటే ఏంటో తెలుసా అని అడగాలని మీడియాకు సూచించారు. అత్యవసర సేవలు అవసరమైతే ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. మీ సేవలు అత్యవసరం, విలువైనవి అని చేతులెత్తి మొక్కినా వారు వినలేదని చెప్పారు. 11 వరకు డిమాండ్లు వస్తే మేం చేయాల్సిన 8 వరకు వారి సమస్యల్ని తీర్చామని సజ్జల పేర్కొన్నారు. మేనిఫెస్టోలో చెప్పినట్లే తెలంగాణలో ఉన్నట్లు ఇక్కడ అన్ని ఇంప్లిమెంట్ చేశాం, ప్రభుత్వం చాలా సంయమనంగా ఉందన్నారు. గుర్రాలతో తొక్కించింది ఎవరు, రైతులపై కాల్పులు జరిపింది ఎవరు.. లోకేష్ విషయాలు తెలియకుండా మాట్లాడకూడదన్నారు. 


కాంగ్రెస్ లో షర్మిల చేరికపై సజ్జల రియాక్షన్
కాంగ్రెస్ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయన్నారు. గత రెండు ఎన్నికల్లో వారికి ఒక్క సీటు కూడా రాలేదని, వారి గురించి ఎవరూ సీరియస్ గా లేరని సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడంతో ఆమె రాజకీయ ప్రస్థానం మొదలైందన్నారు. ఆ తరువాత కాంగ్రెస్ లోకి రావాలనుకున్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ ఇలా అందర్నీ మేనేజ్ చేస్తూ అధికారం కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. షర్మిల వల్ల వైసీపీకి ఏ నష్టం లేదన్నారు. ఏపీలో కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని, వారి గురించి తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు సజ్జల. 


బ్రదర్ అనిల్ తో బీటెక్ రవి కలవడం అనుకోకుండా జరిగింది కాదన్నారు. బ్రదర్ అనిల్ వచ్చినప్పుడు క్రిస్టియన్ ఓట్ల కోసం వచ్చారంటూ గతంలో అదే నేతలు ఎన్ని విమర్శలు చేశారో ప్రజలకు తెలుసు. వాటిపై మేం స్పందిస్తే సమస్యలు పక్కదారి పట్టి ఫోకస్ పోతుందని వదిలేశామన్నారు. షర్మిల ఏపీకి వచ్చారని ఇప్పటివరకూ ఏ ప్రకటన రాలేదని, ఆమె ఏపీ నుంచి అండమాన్ వరకు ఎక్కడైనా పనిచేసే ఛాన్స్ ఉందన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి కాంగ్రెస్ హయాంలో జగన్ పెట్టిన వైఎస్సార్ సీపీని చీల్చాలని, బలహీన పరచాలని చూసినా ఏం చేయలేదని పేర్కొన్నారు. నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే లేకుండా పోయిందన్నారు. ఆరోజు వైఎస్సార్ మరణంపై సైతం అనుమానాలు ఉన్నాయని, ఇప్పుడు మరికొన్ని విషయాల్లో జగన్ పై దుమ్మెత్తి పోసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ లో షర్మిల చేరిక సైతం చంద్రబాబు కట్రల్లో భాగమన్నారు. అభివృద్ధి అనేది లేకుండా, సైడ్ ట్రాక్ రాజకీయాలతో లబ్ది పొంది అధికారంలోకి రావాలని చూడటమే చంద్రబాబు ప్లాన్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.